Tomato prices : నిన్నమెన్నటి దాకా హడలెత్తించిన టమాటా ధరలు ఒక్కసారిగా నేలకు దిగాయి. నెల రోజుల క్రితం కిలో రూ.200 దాకా పలికిన టమాటాలు ప్రస్తుతం అందుబాటు ధరలోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ రైతు బజార్‌లో శనివారం కిలో టమాటాలు రూ.15కే విక్రయించారు. టమాటాలతోపాటు వంకాయ, దొండకాయ వంటి ఇతర కూరగాయల ధరలు కూడా తగ్గుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా టమాట ధరలకు ఇటీవల అనూహ్యంగా రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. మే చివరి వారంలో మొదలైన ధరల పెరుగుదల ఊహించని స్థాయికి చేరుకుంది. జూలై రెండో వారం కిలో రూ.80గా ఉన్న టమాట ధర.. అదే నెల చివరికి వచ్చేసరికి రూ.150, 180 వరకు చేరింది. ఒక దశలో పలు ప్రాంతాల్లో కిలో రూ.200 చొప్పున కూడా విక్రయించారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు టమాటాల వాడకాన్ని తగ్గించేశారు.
కొత్త పంట చేతికి అందడంతో..
కొత్త పంట చేతికి అందడంతో రైతుల నుంచి మార్కెట్‌కు వస్తున్న టమాటాల దిగుమతి కొద్దిరోజులుగా అధికమైంది. మరోపక్క, దళారుల ద్వారా కాకుండా చాలామంది రైతులు నేరుగా రైతు బజార్లకే వచ్చి తమ పంటను విక్రయిస్తున్నారు. దీంతో డిమాండ్ కంటే దిగుమతి ఎక్కువై టమాటాల ధరలు కొంతమేర అదుపులోకి వచ్చాయి. రైతు బజార్లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్‌ల్లోనూ టమాటాల ధరలు భారీగా తగ్గాయి. ముఖ్యంగా ఏపీలోని మదనపల్లి వ్యవసాయ మార్కెట్‌లో కిలో టమాటా అత్యల్పంగా రూ.5 పలికింది. ఏ గ్రేడ్ రకం టమాట ధర రూ.10 నుంచి రూ.15 దాకా పలకగా, బీ గ్రేడ్ రకం ధర రూ.5 నుంచి రూ.9 వరకు పలికింది.
ధరలు తగ్గిపోతున్నాయి
మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్, కోలార్, ఛత్తీస్ గడ్‌లోని రాయపూర్ మార్కెట్‌లలో కూడా ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కాగా, టమాటతోపాటు వంకాయ, బెండకాయ, కాకరకాయ, పచ్చిమిర్చి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. రైతు బజార్లలో టమాట, పచ్చిమిర్చి ధరలు తగ్గినప్పటికీ కాలనీలు, బస్తీల్లోని దుకాణాల్లో మాత్రం అధిక ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. ఆయా దుకాణాల్లో కిలో టమాట ప్రస్తుతం రూ.40, పచ్చిమిర్చి రూ.35కు విక్రయిస్తున్నారు.