AP Movie Ticket Prices : ‘ఈమధ్య ఏపీ సీఎం జగన్ పై కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు విరుచుకుపడుతున్నారు. మిగతా విషయాలను పక్కనబెట్టి జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. జగన్ చేసే ఏ కార్యక్రమంలోనైనా వంకలు పెడుతూ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. అసలు విషయంపై ఆరాతీయకుండా సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎడా పెడా ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అసలు జగన్ చేసిన తప్పేంటి..? అభివృద్ధి పనులు చేయడమా..? ఆయన చేసిన పనులు నచ్చకనే విమర్శలు చేస్తున్నారా..? అంతేకాకుండా కొందరు జగన్ కు దమ్ముందా..? అని అంటున్నారు. జగన్ కు దమ్ము లేనిదే సాధ్యం కాని పనులు చేస్తున్నారా..?’ టాలీవుడ్ తో జగన్ వ్యవహారశైలి పై ప్రత్యేక కథనం..
CM Jagan Vs Tollywood
రాష్ట్రంలోని సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపుపై కొందరు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచారు. ఏపీ సర్కార్ టికెట్ రేట్లు పెంచితే ప్రభుత్వం, సినిమా వాళ్లు కుమ్మక్కయి ప్రజలను దోచుకుంటారని అంటున్నారు. అలా కాకుండా జనం పక్షాన నిలబడి రేట్లు తగ్గిస్తే సినిమా రంగంపై వివక్ష చూపుతున్నారని అంటున్నారు. అంటే ఒక సీఎం ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోకుడదా..? వాస్తవానికి సినిమా టికెట్ల రేట్లు సామాన్యుడు చూడలేని విధంగా లేవా..? ఈ విషయంలో జగన్ కు దమ్మ ఉంటేనే కదా.. పేదల పక్షాన నిలబడి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు..
ఆసుపత్రులు అడ్డగోలుగా బిల్లలు వసూలు చేస్తున్నారని కరోనా సమయంలో ఆందోళనలు జరిగాయి. ఈ సమయంలో ఆసుపత్రి యాజమాన్యాలు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ రేట్లకు మేం వైద్యం చేయమని భీష్మించుకు కూర్చున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం సామాన్యుల పక్షాన నిలబడి కచ్చితంగా వారికి తక్కువ రేట్లకే వైద్యం చేయాలని ఆదేశాలు ఇవ్వలేదా..? ఇక్కడ కూడా జగన్ దమ్ము చూపించినట్లా..? లేదా..?అలాగే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ ద్వారా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆరోగ్యశ్రీలో పొందుపరిచిన రేట్లకు మేం చేయలేమని కూడా ఆందోళన జరిగింది. కానీ కచ్చితంగా చేయాల్సిందేనని సీఎం చెప్పారు. ఈ సమయంలో ప్రజలను దోచుకున్నట్లా..?
ఇక విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి జగన్ నడుం బిగించిన విషయం తెలిసిందే. అయితే ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యం ఇప్పటి వరకు ఉన్న ఫీజు రేట్లతో తమ కాలేజీలను కొనసాగించమని ఆందోళన చేశారు. వీరికి తోడుగా డిగ్రీ, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఫీజు రేట్లు పెంచాలని కోర్టుకెక్కారు. కానీ జగన్ రెగ్యులరైజేషన్ చేశారు కదా..?
ఇలా జగన్ ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు కొందరు. ఆయన ఏం చేసినా వాటిలో ఏదో ఒక కారణంతో తిట్టడమే పనిగా పెట్టుకునే బదులు అందులో అసలు వివరాలను బయటపెట్టే వారు ఎవరూ కనిపించడం లేదు. సినిమా రేట్లు తక్కువ చేస్తారా..? అని రాజకీయ నాయకులు అంటున్నారు. మరి ఎక్కువ చేస్తే ప్రజలను దోచుకుంటారని వాదన పెడుతారు. బోడిగుండుకు, మోకాలికి లింకు పెట్టడమే కానీ జగన్ చేసే మంచి పనులు మాత్రం ఎవరికీ కనిపించడం లేదు. అసలు జగన్ ను విమర్శించేవాళ్లు పేదల పక్షాన ఉన్నట్లా..? లేక సంస్థల పక్షాన ఉన్నట్లా..?
సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని జగన్ కొన్ని కార్యక్రమాలు చేపడితే అవి ఎందుకు చేస్తున్నారనే విధంగా ఉంది వీరి విమర్శలు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వం రేట్లను కంట్రోల్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమం ప్రవేశపెట్టారు. అయితే ఆ విధానం ద్వారా పేదల భూములకు నష్టం కలుగుతుందని ప్రచారం చేస్తున్నారు. తమ భూముల వివరాలు ప్రభుత్వ పరిధిలోకి వస్తే రేట్లు కంట్రోల్ లో ఉంటాయన్న విషయం వీరికి అర్థం కాదా..? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.