https://oktelugu.com/

Jagan Tollywood: సీఎంతో టాలీవుడ్ అగ్రహీరోల భేటి.? మొత్తం ఎపిసోడ్ తో తేలిన నీతి ఏంటంటే?

Jagan Tollywood: కొంతకాలంగా టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన వివాదానికి ఈరోజు ముగింపు పలుకనున్నారు. అటు టాలీవుడ్ అగ్రహీరోలు, అగ్ర దర్శకులు.. సీఎం జగన్ ను కలవడానికి స్వయంగా తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. ఇప్పటికే కొత్త టికెట్ల ధరలు.. టాలీవుడ్ కోరికలపై నివేదిక సిద్ధం కావడంతో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. టాలీవుడ్ ప్రముఖులంతా జగన్ తో భేటి తర్వాత జగన్ వరాలు కురిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.ఇద్దరి మధ్య లంచ్ మీటింగ్ లో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 10, 2022 / 08:46 AM IST
    Follow us on

    Jagan Tollywood: కొంతకాలంగా టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన వివాదానికి ఈరోజు ముగింపు పలుకనున్నారు. అటు టాలీవుడ్ అగ్రహీరోలు, అగ్ర దర్శకులు.. సీఎం జగన్ ను కలవడానికి స్వయంగా తాడేపల్లి నివాసానికి వస్తున్నారు. ఇప్పటికే కొత్త టికెట్ల ధరలు.. టాలీవుడ్ కోరికలపై నివేదిక సిద్ధం కావడంతో ఈ భేటి ప్రాధాన్యత సంతరించుకుంది. టాలీవుడ్ ప్రముఖులంతా జగన్ తో భేటి తర్వాత జగన్ వరాలు కురిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.ఇద్దరి మధ్య లంచ్ మీటింగ్ లో ఈ సమస్యల పరిష్కారంపైనే చర్చ సాగింది.

    -టాలీవుడ్ తో అసలు వివాదానికి కారణమేంటి?
    ఏపీలో సీఎం జగన్ కొలువుదీరగానే టాలీవుడ్ పెద్దలు అస్సలు పట్టించుకోలేదన్న విమర్శ ఉంది. సీఎం జగన్ ను కలిసి కనీసం సన్మానించిన పాపాన పోలేదన్నది వైసీపీ వర్గాల వాదన.. కొందరు అగ్రహీరోలు, నిర్మాతలు, దర్శకులు కనీసం సోషల్ మీడియాలోనూ సీఎం జగన్ ను కనీసం అభినందించిన పాపాన పోలేదని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

    -టాలీవుడ్ పెద్దల వాదనేంటి?
    సీఎం జగన్ ను టాలీవుడ్ గుర్తించలేదన్న అక్కసు కారణంగానే జగన్ ఇలా చిత్రపరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఒక టాక్ ఉంది. టాలీవుడ్ పెద్దల తిక్క కుదిర్చేందుకే ఆన్ లైన్ టికెటింగ్, కొత్త టికెట్లు ఖరారు చేశారని అంటున్నారు. అయితే టాలీవుడ్ పెద్దలు మాత్రం అలాంటిదేమీ లేదని.. జగన్ అంటే తమకు గౌరవం అని.. రాజకీయాల్లోకి సినీ పరిశ్రమను లాగవద్దని అంటున్నారు. రాజకీయాల్లో ఇన్ వాల్వ్ కావద్దనే తాము మౌనంగా ఉన్నామంటున్నారు.

     

    -టాలీవుడ్ అగ్రహీరోలు, అగ్ర దర్శకులు ఎందుకు తరలివస్తున్నారు?
    ఏపీ సీఎం జగన్ దెబ్బకు టాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. బీ, సీ సెంటర్లలో రూ.5 టికెట్ ధర నిర్ణయించడం టాలీవుడ్ కలెక్షన్లపై భారీ దెబ్బ తీసింది. ఇక పెద్ద సినిమాలు, చిన్న సినిమాలకు ఒకే రేటు పెట్టడం శరాఘాతంగా మారింది. ఇన్నాళ్లు 100 కోట్లు, 200 కోట్లు అంటూ వసూళ్లు సాధించి.. కోట్లకు పడగలెత్తిన సినీ పెద్దలకు ఈ నిర్ణయం శరాఘాతంగా మారింది. కనీస వసూళ్లు రాని పరిస్థితి. రెమ్యూనరేషన్లు పడిపోతాయి. 50శాతం అక్యూపెన్సీ పెట్టడం కూడా సినిమాల కలెక్షన్లపై భారీ ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే జగన్ ను ప్రసన్నం చేసుకోవడానికి.. సినిమా టికెట్ల వివాదాన్ని పరిష్కరించేందుకు టాలీవుడ్ పెద్ద చిరంజీవి సహా అగ్రహీరోలు మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ సహా అగ్ర దర్శకులు రాజమౌళి, కొరటాల శివ లాంటి ప్రముఖులు తరలివస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ సర్కార్ నిర్ణయాలతో కుదేలైన టాలీవుడ్ కోసమే వీరంతా వస్తున్నారని టాక్ నడుస్తోంది.

    -మరిప్పుడు ఏం జరుగనుంది?
    టాలీవుడ్ టికెట్ల రేట్లపై ఇప్పటికే చాలా మంది విమర్శలు గుప్పించారు. కొందరు సినీ పెద్దలు, ఇతర భాష ప్రముఖులు.. టీడీపీ, ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై దుమ్మెత్తి పోశాయి. ఇది కక్షసాధింపు చర్య అని విమర్శలు గుప్పించారు. ఈ వివాదం ఏపీ సర్కార్ ను ఇరుకునపెడుతోంది. అందుకే మెగాస్టార్ చిరంజీవిని రప్పించి మరీ జగన్ లంచ్ భేటిలో సాధకబాధకాలు మాట్లాడారు. సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈసారి టాలీవుడ్ దిగ్గజాలంతా తరలివస్తుండడం.. జగన్ తో చర్చలు జరుపనుండడంతో ఈసారి ఖచ్చితంగా టాలీవుడ్ కు ఉపశమనం కలిగించేలా జగన్ ప్రకటించబోతున్నాడని తెలుస్తోంది. నివేదిక కూడా రెడీ అయ్యిందని.. టాలీవుడ్ టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇతర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని అంటున్నారు.

    -దీన్ని బట్టి ఏం అర్థమైంది?
    అనాదిగా టాలీవుడ్ పరిశ్రమ మొత్తం తెలుగుదేశం వెంట ఉంది. నాడు ఎన్టీఆర్ ను.. నేడు చంద్రబాబుకు సపోర్టుగా ఉంది. ఏపీలో అధికారం మారిన జగన్ ను టాలీవుడ్ గుర్తించలేదన్న అపవాదు ఉంది. కానీ ఇప్పుడు చిరంజీవి, అగ్రహీరోలు అంతా కలిసి సమస్య పరిష్కారానికి.. టాలీవుడ్ ను బతికించేందుకు ముందుకు రావడం గొప్ప పరిణామంగా చెప్పొచ్చు. జగన్ ను గుర్తించడం లేదన్న విమర్శలకు చెక్ చెప్పేందుకే టాలీవుడ్ దిగ్గజాలంతా కదిలివస్తున్నారు. అపోహలకు చెక్ పెట్టి సమస్య పరిష్కారం కోసం వీరంతా ఏకమయ్యారు. పంతాలు, పట్టింపులు , అపోహలు పోయి టాలీవుడ్ కు మేలు జరిగితే అందరూ బతుకుతారు.. టాలీవుడ్ పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది. అదే కావాల్సింది.. !