Ap CM Jagan vs Tollywood: లక్షల బడ్జెట్ లో సినిమా తీసే సంపూర్ణేష్ బాబు సినిమాకు రూ.100 పెట్టి కొనే ఏపీ ప్రేక్షకుడు.. 500 కోట్లు పెట్టి సినిమా తీసే రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను అదే రేటుకు కొని చూడాలి. ఏపీలో అంతే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఇండస్ట్రీ ఉనికినే ప్రమాదంలో పడేస్తోంది. ఏపీలో ఉన్న టిక్కెట్ రేట్లు అలానే కొనసాగితే కనీసం థియేటర్ల కరెంట్ బిల్లు కూడా రాదని.. మూసేసుకోవడం మంచిదని ఎగ్జిబిటర్ కం నిర్మాత సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. మిగిలిన నిర్మాతలు బయటపడకున్నా వారిదీ లోలోపల అదే మాట..
దిల్ రాజు, డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి భారీ నిర్మాతలు ఇప్పుడు జగన్ సర్కార్ తెచ్చిన కనీస టిక్కెట్ ధర చట్టంపై లోలోపలే నెత్తినోరు బాదుకుంటున్నారు. కొందరైతే సినిమాలు రిలీజ్ చేయడం కంటే ఓటీటీలో అమ్ముకోవడం బెటర్ అని అంటున్నారు.
ఏ రకంగా చూసినా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన విధానం, టిక్కెట్ రేట్లు, అదనపు, బెనిఫిట్ షోల రద్దు నిర్ణయం సినీ ఇండస్ట్రీని చావుదెబ్బ తీయడం ఖాయమన్న ఆవేదన సినీ వర్గాల్లో సాగుతోంది. మరి ఇప్పుడేం చేయాలన్నది అంతుబట్టని వ్యవహారంగా మారింది.
సురేష్ బాబు ఓపెన్ అవ్వగా.. ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి సినిమా టిక్కెట్ రేట్ల ఖరారు విషయంలో సీఎం జగన్ పునరాలోచించాలి అని ట్వీట్ చేసి వేడుకున్నారు. మిగతా నిర్మాతలు సినిమాలు రిలీజ్ లు ఉండడంతో నోరు మెదపడం లేదు.
అయితే ఇప్పటికైనా టాలీవుడ్ ను కూకటివేళ్లతో పెకిలించే జగన్ సర్కార్ నిర్ణయంపై సినీ పెద్దలు, ప్రముఖులు అంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. తమ సమస్యలేమిటో అందరూ కలిసి కూర్చొని ప్రభుత్వం తప్పు చేస్తుంటే అదే విషయం బహిరంగంగా చెప్పి ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే వాళ్లు మునగడమే కాదు.. సినీ ఇండస్ట్రీని ముంచినవారు అవుతారు. జగన్ సర్కార్ పంతానికి బలికావాల్సి వస్తుంది.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలను టాలీవుడ్ అంతా ఏకమై అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంతటి తక్కువ సినిమా టిక్కెట్లు లేవు. సినీ పరిశ్రమకు పెంచుకునే స్వేచ్ఛ ఉంది. షోలో విషయంలోనూ కావాల్సినంత ఫ్రీడం ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం కావాలని సినీ ఇండస్ట్రీని శాసించాలని చేస్తున్న ఈ నిర్ణయాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం టాలీవుడ్ పై ఎంతైనా ఉంది.
చిరంజీవి, నిర్మాతలు , దర్శకులు వచ్చి ఏపీ మంత్రి పేర్ని నాని, సీఎం జగన్ ను కలిసి మాట్లాడినా.. వేడుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. ఆఖరుకు జగన్ కు ఆత్మీయుడు, వ్యాపార భాగస్వామి నాగార్జున చెప్పినా కూడా జగన్ వినలేదంటే పరిస్థితి చేయిదాటిపోయిందని ఇప్పటికైనా టాలీవుడ్ గుర్తెరగాలి..
ఏపీ ప్రభుత్వం మొండిగా వెళుతోంది. సో టాలీవుడ్ నిరసన కానీ.. ఆందోళన బాట కానీ పట్టాలి. లేదంటే కోర్టుకెక్కి ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలి. బతిమిలాడితే జగన్ వినడని తేలిపోయింది. ఎవరో ఒకరు గళమెత్తకుండా టాలీవుడ్ ప్రముఖులంతా ఐక్యంగా ఉద్యమిస్తే ఎవరూ టార్గెట్ కారు. ఎవరికి వారు చేస్తే ఇలా టాలీవుడ్ పుట్టి మునుగుతుంది. తమ బతుకునిచ్చే టాలీవుడ్ ను కాపాడుకుంటారో.. జగన్ పంతానికి తలొగ్గి కబళించుకుంటారో అన్నది ఇప్పుడు సినీ పెద్దల చేతుల్లో ఉంది. పరిశ్రమ ఎలా పోతే మనకెందుకు అని ఊరుకుంటూ అందరూ రోడ్డున పడడం ఖాయం. సో ఇప్పటికైనా టాలీవుడ్ ఏకం కావాల్సిన అవసరం ఉంది.