Chandrababu Case: చంద్రబాబు కేసుల్లో నేడు కీలకం… ఉత్కంఠ

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ కు దాదాపు నెల రోజులవుతోంది. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 9, 2023 12:33 pm
Follow us on

Chandrababu Case: చంద్రబాబు కేసుల విచారణలో నేడు అత్యంత కీలకం. కింది కోర్టుల నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు తీర్పులు వెల్లడి కానున్నాయి. అయితే అందరి దృష్టి సుప్రీంకోర్టు పైనే ఉంది. అక్కడ గాని చంద్రబాబుకు అనుకూల తీర్పు వస్తే ఆయన దాదాపు కేసుల నుంచి బయటపడినట్టే. స్కిల్ డెవలప్మెంట్ స్కాంతో పాటు రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్రోడ్ అలైన్మెంట్ కేసు, అంగళ్ళ అల్లర్ల కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో కీలక తీర్పులు వెల్లడి కానున్నాయి.

చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ నేడు విచారణకు రానుంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈనెల 3న దీనిపై ఇరుపక్ష వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ముందు దాఖలు చేసిన పత్రాలను తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. విచారణను తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ కేసు 59వ ఐటెం కింద విచారణకు రానుంది. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాదులు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింగ్వి, సిద్ధార్థ లూథ్ర, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ, రంజిత్ కుమార్ మొన్న వాదనలు వినిపించారు. ఇప్పుడు కూడా వారే వాదించనున్నట్లు తెలుస్తోంది.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన రిమాండ్ కు దాదాపు నెల రోజులవుతోంది. సుప్రీంకోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సైతం ఎంతో నమ్మకం పెట్టుకున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుప్రీం కోర్టు అడిగిన పత్రాలను సమర్పించారు. మరోవైపు చంద్రబాబు న్యాయవాదులు అదనపు పత్రాలు సమర్పిస్తూ.. ఐఏ దాఖలు చేశారు. తీర్పు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు సంచలనం కానుంది. ప్రధానంగా 17 ఏ సెక్షన్ చుట్టూ వాదనలు కొనసాగనున్నాయి.

మరోవైపు చంద్రబాబు పై నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్ కేసుల్లో బెయిల్ పిటిషన్ లపై సోమవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, పోలీస్ కస్టడీ కోరుతూ సిఐడి వేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. అయితే పైకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే… కింది కోర్టులు నిర్ణయాలు వెల్లడించవు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తరువాతే కింది కోర్టులు తమ నిర్ణయాలు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.