Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఈరోజు కీలకం. సర్వోన్నత న్యాయస్థానంలో ఇవాళ కేసుల విచారణ జరగనుంది. ప్రధానంగా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు గత నెల రోజులుగా విచారణలు, వాయిదాల పర్వం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
స్కిల్ స్కాం కేసునకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇదే రోజు విచారణ చేపట్టనున్నారు. స్కిల్ స్కాం లో క్వాష్ పిటిషన్ పై ఇప్పటికే పలుమార్లు సుప్రీంకోర్టులో తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూధ్ర, ఏపీ సిఐడి తరఫున ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపిస్తున్నారు.
ప్రధానంగా ఈ కేసులో వాదనలన్నీ 17 ఏ సెక్షన్ చుట్టూ తిరుగుతున్నాయి. చంద్రబాబుకు 17a వర్తిస్తుందా? లేదా? అనే దానిపై కీలకతీర్పు వెలువడాల్సి ఉంది. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని,ఆయన తరుపు న్యాయవాదులు వాదిస్తున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, 17 ఇయర్స్ చట్టం అవినీతిని నిరోధించడానికి తీసుకొచ్చిందే తప్ప.. అలాంటి వారికి రక్షణగా కాదని సిఐడి తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
ప్రజా ప్రతినిధుల అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పు మార్గదర్శకంగా నిలవనుండడంతో.. అత్యున్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారిస్తోంది. లోతైన విచారణ జరుపుతోంది. ఈ కేసులో తీర్పు ఎలా వచ్చినా సంచలనమే. రాజకీయ కక్షపూరిత కేసులను నియంత్రించేందుకే కేంద్ర ప్రభుత్వం 17a సెక్షన్ తీసుకొచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా తీర్పు వస్తే రాజకీయ కక్ష లకు చెక్ పడినట్లు అవుతుంది. లేకుంటే మాత్రం ముందున్న ప్రభుత్వాధినేతలు వెనుక వచ్చే ప్రభుత్వాలు పెట్టే కేసుల బాధితులుగా మిగులనున్నారు. అందుకే దేశం యావత్తు ఈ కేసు గురించి ఆశగా ఎదురు చూస్తోంది. అయితే కోర్టు తుది తీర్పు వెల్లడిస్తుందో? లేకుంటే మరోసారి విచారణను వాయిదా వేస్తుందో చూడాలి.