Pawan Kalyan CM: గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీ పాలిటిక్స్ ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరికి శత్రువులో అర్థం కావడం లేదు. విభిన్న ప్రకటనలు చేసి నేతలు డిఫెన్స్ లో పెడుతున్నారు. ఒక వైపు స్నేహ హస్తం అందిస్తూనే ఆ పార్టీ నుంచే చేరికలను ప్రోత్సహిస్తున్నారు. ఆ పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఎదుర్కోవడం విపక్షాలకు గట్టి టాస్కే. విడివిడిగా పోటీచేస్తే మాత్రం అధికార పక్షానికి ఎదురుండదు. అందుకే టీడీపీ, జనసేనల మధ్య పొత్తు అంశం బయటపడింది. కానీ ఒక కొలిక్కి రాలేదు. చంద్రబాబు, పవన్ లు పరస్పర అవగాహనకు వచ్చారని తెలిసినా బయటపడడం లేదు. ఎన్నికల సమీపంలో వ్యూహాల్లో భాగంగా చెప్పుకొస్తామని చెబుతున్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాలన్నది చంద్రబాబు, పవన్ ల ఆలోచన. అయితే బీజేపీ మాత్రం ఓన్లీ జనసేనతోనే కలిసి నడుస్తామని చెబుతోంది. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. బీజేపీ దరికి రాకపోవడం వల్లే ఆ పార్టీలో కీలక నేతలను సైకిలెక్కించే పనిలో చంద్రబాబు పడ్డారన్న టాక్ నడుస్తోంది. మరోవైపు చంద్రబాబుతో పొత్తు విషయంలో పునరాలోచించాలని పవన్ కు మిగతా పార్టీల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఇటీవల పవన్ కూడా పొత్తులకు సంబంధించి ప్రకటన చేయలేదు. ఇటువంటి సమయంలో కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తాజాగా చేసిన వ్యాఖ్యలు పొత్తు ఉంటుందా? లేదా? అని సంశయం కలుగుతోంది.
ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో హరిరామజోగయ్య వ్యాఖ్యలు వైరల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్‌ను సిఎం అభ్యర్థిగా పేర్కొనకపోతే జనసేన క్యాడర్ టిడిపి మరియు జనసేన మధ్య పొత్తుకు మద్దతు ఇస్తుందా అన్న ప్రశ్నపై జోగయ్య స్పందించారు. అధికారం పంచుకోకుండా, పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా పేర్కొనకపోతే, జనసేన క్యాడర్ కూటమికి మద్దతు ఇవ్వదని ధైర్యంగా ప్రకటన చేశారు. అంతటి తో ఆగకుండా ఈ విషయం స్వయంగా పవన్ కళ్యాణ్‌కు కూడా తెలుసునని అన్నారు.జోగయ్య చేసిన వ్యాఖ్యలు రాబోయే ఎన్నికల్లో పొత్తును పరిశీలిస్తున్న టీడీపీ, జేఎస్పీలకు ప్రత్యక్ష సవాల్‌గా పరిణమించాయి. జోగయ్య తాజా కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
గత కొద్దిరోజులుగా కాపు సంక్షేమ సంఘం తరుపున హరిరామజోగయ్య గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. కాపులకు మద్దతుగా మాట్లాడుతున్నారు. పవన్ ను సీఎం చేయాలన్న బలమైన ఆకాంక్షతో పనిచేస్తున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న హరిరామజోగయ్య ఒక్క సీఎం పదవి తప్పించి.. దాదాపు అన్ని పదవులు చేపట్టారు. ఈ నేపథ్యంలో కాపులకు ముఖ్యమంత్రి పీఠం పవన్ ద్వారా సాధ్యమవుతుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే ఎనిమిది పదుల వయసులో జనసేనలో చేరకుండా కాపు సంక్షేమ సంఘం తరుపున మద్దతు తెలుపుతూ వస్తున్నారు.