Homeజాతీయ వార్తలుసొలిసిటర్ జనరల్ తో సువేందు అధికారి భేటీపై టీఎంసీ ఆగ్రహం

సొలిసిటర్ జనరల్ తో సువేందు అధికారి భేటీపై టీఎంసీ ఆగ్రహం

భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, శారద చిట్ ఫండ్ కుంభకోణంలో నిందితుడైన సువేందు అధికారితో సమావేశం కావడం సంచలనం కలిగించింది. తుషార్ మెహతా, సువేందుల భేటీ అనైతికమని ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధానికి లేఖ రాసింది. దీంతో పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది. పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడైన సువేందు అధికారితో తుషార్ మెహతా కలవడంపై టీఎంసీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అయితే దీనిపై తుషార్ మెహతా వివరణ ఇచ్చారు. సువేందు అధికారి వచ్చినప్పుడు తాను బిజీగా ఉన్నానని తెలిపారు. చాలా సేపటికి సమావేశం అయిపోయాక కానీ పీఏ ద్వారా సువేందు వచ్చిన విషయం తెలిసిందన్నారు. చివరికి తనను కలవకుండానే సువేందు వెళ్లిపోయారన్నారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా శారద చిట్ ఫండ్ కుంభకోణం కేసులో సీబీఐ తరఫున వాదనలు వినిస్తున్న వ్యక్తి కావడం గమనార్హం.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గెలుపొంది మమత మూడోసారి సీఎం అయిన కొద్ది రోజులకే శారద కేసును తిరగదోడిన కేంద్రం సీబీఐని రంగంలోకి దింపింది. టీఎంసీ మంత్రులను అరెస్టు చేయించింది. ఆ సమయంలో మమత కోర్టులపై, కేంద్రంపై విమర్శలు చేశారు. బీజేపీలో సువేందు అధికారిని మాత్రం వదిలేసి మిగతావారిని అరెస్టు చేయడాన్ని టీఎంసీ తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ అధికారిగా ఉంటూ సొలిసిటర్ జనరల్ బీజేపీ నేతలను కలుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. న్యాయవ్యవస్థలోని లోపాలను, బీజేపీ చీకటి వ్యవహారాలను టీఎంసీ వెలుగులోకి తెచ్చింది.

సొలిసిటర్ జనరల్ సువేందు అధికారితో కలవడంతో కేసుల విచారణపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రధానికి రాసిన లేఖలో టీఎంసీ పేర్కొంది. నిందితులపై భేటీ అవుతూ ఆయన పదవికి మచ్చ తెచ్చకుంటున్నారని ఆరోపించింది. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఇలాంటి చౌకబారు పనులు చేయడమేమిటని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థకు ప్రజలకు నమ్మకం కలిగేలా హుందాగా వ్యవహరించాల్సింది పోయి వారితో కలవడం దారుణమన్నారు. ఈ అంశంపై పోరాడేందుకు సమాయత్తం అవుతున్నట్లు టీఎంసీ తెలిపింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular