Tirupati YSR Congress Leaders: అడవి జంతువులను వేటాడితే శిక్షలు పడతాయని తెలిసినా కొందరు తేలికగా తీసుకుంటున్నారు. జింక వేట కేసులో సినీనటుడు సల్మాన్ ఖాన్ కోర్టుల చుట్టు తిరిగిన సంఘటనలున్నా వారు పట్టించుకోవడం లేదు. చుక్కల దుప్పి పంట పొలాల్లోకి రావడంతో దాన్ని వేటాడి పట్టుకుని పోగులు వేసుకుని వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. అది ఎవరో కాదు సాక్షాత్తు వైసీపీ నాయకులే ఈ పనిచేయడం వివాదమవుతోంది. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
శేషాచలం కొండల్లో నుంచి ఓ చుక్కల దుప్పి దారి తప్పి తిరుపతి జిల్లా యర్రావారిపాళ్యం మండలంలోని వీఆర్ అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం అడవిలో నుంచి చుక్కల దుప్పి బయటకు రావడంతో అక్కడే ఉన్న వైసీపీ నాయకులు దాన్ని వెంబడించి వేటాడి పట్టుకున్నారు. అనంతరం దాన్ని కోసుకుని కుప్పలు వేసి వండుకుని తిన్నారు.
జంతువులను వేటాడటం నేరమని తెలిసినా వారు ఇలా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వారితో పాటు మహిళలు కూడా దుప్పిని పట్టుకునేందుకు సహకరించారని సమాచారం. మొత్తానికి దాన్ని పంచుకుని తినడం సంచలనం కలిగించింది. అటవీ జంతువులను వేటాడితే చర్యలు ఉంటాయని తెలిసినా వారు భయపడటం లేదు. పెద్ద పెద్ద వారినే జైలు పాలు చేసిన ఉదంతాలున్నా వారు మాత్రం జాగ్రత్త పడటం లేదు.
వీరు చేసిన తతంగాన్ని ఓ వ్యక్తి సీక్రెట్ గా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. వీఆర్ అగ్రహారం మాజీ సర్పంచ్ చంద్ర, కిష్టయ్య, నాగేశ్వర్ రావు, చిన్నబ్బతో పాటు సాయిబులపల్లి గ్రామానికి చెందిన మహిళలు దుప్పిని వేటాడారు. దీంతో దుప్పిని వేటాడిన కేసులో కిష్టయ్యను అరెస్టు చేశారు. మిగతా వారిని కూడా అరెస్టు చేస్తామని చెబుతున్నారు.