తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో అధికార పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సమీప ప్రాంతాలకు చెందిన జనాన్ని బస్సుల ద్వారా తరలించి దొంగ ఓట్లు వేయించారని విమర్శించాయి. అంతేకాదు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
అయితే.. దొంగ ఓట్లు వేయడం వెనుక తీవ్రమైన నేరం కూడా ఉందన్నది ప్రధానా ఆరోపణ. అదే.. నకిలీ ఓటరు ఐడీ కార్డుల ముద్రణ! నకిలీ ఓటరు కార్డులు ముద్రించి మరీ.. దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా చూపిస్తున్నాయి. ఇలా ముద్రించిన కార్డుల సంఖ్య వేలల్లో ఉందని నేతలు అంటున్నారు.
అలాంటి వారు దొరికినా.. పోలీసులు చర్యలు తీసుకోకపోగా.. వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే.. వ్యవస్థలు కూడా ఈ అక్రమానికి మద్దతు తెలిపాయని అర్థమవుతోందని విపక్ష నేతలు ఆరోపించారు. ఇలాంటి అక్రమాలు చెల్లవని నిరూపించాలంటే.. తిరుపతిలో రీ-పోలింగ్ నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. దొంగ ఓటరు కార్డుల తయారీ అనేది చాలా తీవ్రమైన నేరమని, దీన్ని ఉపేక్షిస్తే.. దేశ సమగ్రతకు కూడా భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోకుంటే.. భవిష్యత్ లో విచ్చలవిడిగా ఇలాంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అందువల్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నిజానికి ఇలాంటి పని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. దీనిపై ఎంపీ లేఖరాశారు కాబట్టి.. వాళ్ల ఫిర్యాదులు రికార్డుల్లో నమోదవుతాయి. వాటిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అనేది కూడా వెల్లడించాల్సి ఉంటుంది. అందువల్ల దీన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంటే.. ఎన్ఐఏ దర్యాప్తునకు కూడా ఆదేశించే అవకాశం ఉంటుంది. మరి, ఏం జరుగుతుంది అన్నది చూడాలి.