Tirupati Laddu: టిటిడి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నందిని నెయ్యిని వినియోగించకూడదని తీర్మానించారు. దీంతో సుదీర్ఘకాలం నందిని నెయ్యితో ఉన్న బంధాన్ని తెంచుకున్నారు. గత ఐదు దశాబ్దాలుగా శ్రీవారి లడ్డూ తయారీలో నందిని నెయ్యి వినియోగిస్తూ వచ్చారు. అయితే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వ్యవహార శైలితో కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నారు. దీంతో నెయ్యి సరఫరా నిలిచిపోయింది.
నందిని నెయ్యి కర్ణాటక కు చెందినది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్) తయారు చేసే నెయ్యి ఇది. చాలా ఏళ్లుగా కేఎంఎఫ్ నెయ్యి సరఫరా చేసేది. అయితే వివిధ కారణాలతో కేఎంఎఫ్ తో ఉన్న కాంట్రాక్ట్ ను టీటీడీ రద్దు చేసుకుంది.
కేఎంఎఫ్ తన నెయ్యి ధరను భారీగా పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీటీడీ నిర్దేశించిన ధరకు తాము నెయ్యిని సరఫరా చేయలేమని కెఎంఎఫ్ చైర్మన్ భీమా నాయక్ ధ్రువీకరించారు. తక్కువ ధరకు నెయ్యిని సరఫరా చేసే టెండర్ల ప్రక్రియలో తాము పాల్గొనట్లేదని వివరించారు. నాణ్యమైన నెయ్యిని తాము తయారు చేస్తున్నామని.. తక్కువ ధరతో సరఫరా చేయడం వల్ల నాణ్యత కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. తిరుమల తో సహా ఇతర ఆలయాల్లో లడ్డు,ఇతర ప్రసాదాల తయారీ కోసం నందిని నెయ్యిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన టెండర్లను పునసమీక్షిస్తామని చెప్పారు.
అయితే ఇదే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానానికి కేఎంఎఫ్ సమాచారం ఇచ్చింది. టీటీడీ అధికారులు మాత్రం కొత్త ధరలకు ఒప్పుకోలేదు. పాత ధరల ప్రకారమే నెయ్యిని సరఫరా చేయాలని కోరారు. అయితే దీనికి కేఎంఎఫ్ అంగీకరించలేదు. దీంతో ఈరోజు నుంచి నెయ్యి సరఫరా నిలిచిపోయింది. దీంతో దశాబ్దాల కాంట్రాక్టు నిలిచిపోయినట్టయింది. టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.