TTD Tirumala devotees Sufferings : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 కి.మీలు.. ఒక చిన్న చెరువు చుట్టూరా తిప్పడం.. అనంతరం గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయించడం.. ఆ తర్వాత 31 కంపార్ట్ మెంట్లలోకి తోలడం.. ఇదంతా జరగడానికి ఒకరోజంతా నడవాలి. తర్వాత కంపార్ట్ మెంట్ల నుంచి శ్రీవారి దర్శనానికి మరో రోజు.. రెండు రోజుల క్యూలో స్నానాలు చేయకుండా.. కాలకృత్యాలు తీర్చుకోకుండా.. ఆకలి దప్పులకు నలిగి భక్తుల ప్రాణాలు పైపైనే పోతున్న పరిస్తితి.. ఇదీ బ్రహ్మోత్సవాల తర్వాత టోకెన్ సిస్టం రద్దు చేసి ఘనత వహించిన మన తిరుమల తిరుపతి దేవస్థానాలు ‘టీటీడీ’ చేసిన ఏర్పాట్లు.. ఎక్కడో పాపవినాశనం నుంచి అంటే దాదాపు 20 కి.మీల దూరంలో భక్తులను విడిచిపెట్టి సర్వదర్శనానికి అనుమతించిన ‘టీటీడీ’ వ్యవహారశైలిపై తిరుమలలో తిట్టని భక్తుడు లేడు. ఇంత ఘోరంగా హింసించి మరీ.. భక్తులను శ్రీవారి దర్శనానికి పంపిస్తున్న ఆలయ నిర్వాహకులపై శాపనార్థాలు పెడుతున్నారు..
-చంటిబిడ్డలు, పసిపిల్లలు హైరానా..
20కి.మీల దూరం.. పెద్దలు నడుస్తారు.. కానీ పిల్లలు, వృద్ధుల పరిస్థితి ఏంటి. బుద్ది ఉన్నోడు ఎవడైనా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారా? అసలు టీటీడీకి భక్తులపై కనీసం కనికరం ఉందా? చంద్రబాబు ప్రభుత్వంలో సర్వదర్శనం (ఉచిత దర్శనం), శీఘ్రదర్శనం (కాలినడకన), ప్రత్యేక దర్శనం (రూ.300) టికెట్లు పెట్టి పద్ధతి ప్రకారం టోకెన్ సిస్టం ఇచ్చి ఆ టైంకే కంపార్ట్ మెంట్లలోకి పంపేవారు. కానీ ఇప్పుడు వాటన్నింటిని ఎత్తేశారు. బ్రహ్మోత్సవాలు అంటూ.. తమిళ పెరటాసి మాసం అంటూ భక్తుల భారీ రాకతో అన్నింటిని రద్దు చేశారు. ఎంత మంది తిరుమల వచ్చినా గుడికి దూరంగా వదిలి 20 కి.మీలు నడిపించి కనీసం టోకెన్లు ఇవ్వకుండా రెండు రోజుల పాటు నరకం చూపించి నిజంగానే ఆ దేవుడిని చూడడానికి చుక్కలు కనిపించేలా చేస్తున్నారు. ఇంతటి దౌర్భగ్యమైన దారుణ వ్యవస్థ ఏపీలో మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు, చంటి బిడ్డలు ఆకలి దప్పులకు అలమటిస్తూ ఏడ్చిన ఏడుపులు ఈ టీటీడీ పెద్దలకు,ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా? అన్నది భక్తుల ప్రశ్న. పాపవినాశనం నుంచి ఆలయం వరకూ కూడా ఒక్క టీటీడీ అధికారి కాని.. ఒక్క పోలీస్ కానీ కనిపించలేదు. క్యూలల్లో భక్తులను వారి చావుకు వారిని వదిలేశారు. కనీసం నీరు, ఆహారం అందించేవారు లేరు. ఓవైపు వర్షం, చల్లగాలికి అందరూ వణికిపోయిన పరిస్థితి. ఏవో నల్లాలు పెట్టి తాగండని వదిలేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ క్యూలు, తోపులాటల్లో నడవలేక నరకం చూశారు.
-ప్రణాళిక లోపం.,. అవినీతి..
అంతకుముందు టోకెన్ సిస్టం ఉండేది. సర్వదర్శనం, కాలినడకన వారికి శీఘ్రదర్శనం, ప్రత్యేకదర్శనం వారికి టికెట్లు ఇచ్చి ఫలానా టైంకే ఆలయంలోకి కంపార్ట్ మెంట్లోకి పంపించేవారు. దీంతో భక్తుల టైం వృథా అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మరీ ఘోరం. కాలినడకన వచ్చి వారికి నో టోకెన్స్, ప్రత్యేక దర్శనాల రూ.300 టికెట్లు లేవు. తిరుమలలో రూంలు లేవు. మొత్తం బంద్ చేశారు. అధికారులు ఎక్కడికి వెళ్లారో తెలియదు. అన్ని కౌంటర్లు మూసేశారు. అందరినీ సర్వదర్శనం పేరిట 20 కి.మీల ఆవల దించేసి ‘నడచుకుంటూ క్యూలోనే చావండి. దేవుడు కనిపించాలి మీకు అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతూ’ అక్కడున్న సెక్యూరిటీలు ఎద్దేవా చేస్తూ పంపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. తిరుమలకు లక్షల మంది వచ్చే వేళ టీటీడీలో ప్రణాళికలోపం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక అవినీతి దారుణంగా ఉంది. రూ.2వేలు, రూ.3వేలు చెల్లిస్తే చాలు ఎవరినైనా గుడి ముందరి కంపార్ట్ మెంట్ల ముందర దించేసి వారికి త్వరగా దర్శనం కలిగేలా చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా కంపార్ట్ మెంట్ల వద్దనున్న టీటీడీ అధికారులకు కాసులు కురిపిస్తోంది. బ
-వైవీ సుబ్బారెడ్డి, జగన్ ను ఆ 20 కి.మీలు నడిపిస్తే కానీ సమస్య పరిష్కారం కాదు..
తమిళ పెరటాసి మాసం అంటూ తమిళనాడు నుంచి లక్షల మంది వచ్చారు. తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా మరో లక్ష మంది.. ఇంతమంది వస్తే ప్రణాళికబద్దంగా నిర్వహించాలి. కానీ టీటీడీ, జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. భక్తులను 20 కి.మీల ఆవల దింపేసి క్యూలో చావండి అంటూ వదిలేసింది. తిరుమల మొత్తం తిప్పేసి భక్తులకు నరకం అంటే ఏంటో లైవ్ లో చూపించి దేవుడి దర్శనానికే మరోసారి రావద్దు అనేలా చేస్తోంది టీటీడీ. ఇంతటి దుర్మార్గ దుష్ట చేష్టలు టీటీడీ చరిత్రలోనే లేవు. భక్తుల బాధలు తెలియాలంటే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జగన్ లను ఆ ఉచిత దర్శనం 20కి.మీల దూరాన్ని భక్తుల మధ్య క్యూ నడిపించాలి. అప్పుడే ఆ బాధలు తెలిసి.. వీరికి జ్ఞానోదయం కలిగి వసతులు కల్పిస్తారేమో చూడాలి.
-కొసమెరుపు..
చివరగా.. తిరుమలలో దారుణ దర్శన ఏర్పాట్లు చూసి కన్నీరు కార్చని భక్తులు లేరు. భక్తులు వారి మొక్కులు పక్కనపెట్టి మరీ సులభంగా దర్శనం అయ్యేలా చూడాలని.. జగన్, వైవీ సుబ్బారెడ్డి లాంటి టీటీడీ పెద్దలకు బుద్ది కల్పించాలని మొక్కుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు..మరోసారి తిరుమల రావడానికే భక్తులు భయపడేలా చేస్తున్నారు. హిందూ దేవుళ్లపై, భక్తులపై వైవీ సుబ్బారెడ్డికి, జగన్ కు ఏమైనా కోపమా? వారు క్రిస్టియానిటీని నమ్ముతున్నారని.. హిందూ భక్తులను ఇలా టార్చర్ చేస్తున్నారా? అని బీజేపీ , హైందవ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి. ‘దేవుడా… ఇప్పటికైనా తిరుమల లో సౌకర్యాలు కల్పించు’ అని మొక్కడం తప్ప ఈ కరుడుకట్టిన నిర్వాహకుల మనసు మారడం కల్లా..