Congress Cabinet: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం కూడా ప్రమాణస్వీకారం చేయనుంది.. అయితే ఈ మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ జిల్లా నుంచి ఏకంగా ముగ్గురికి సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఇంతకీ ఆ నాయకులు ఎవరంటే..
ముగ్గురికి కీలక బాధ్యతలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజారిటీ వచ్చింది. పది అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ జిల్లాలో భద్రాచలం మినహా మిగతా 9 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన సిపిఐ గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో రికార్డ్ స్థాయిలో మెజారిటీ లభించింది. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు 50 వేల పై చిలుకు ఓట్ల తేడాతో తమ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను ఓడించారు. ఒకరకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా ఒక కారణం.. అయితే ఈ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి కీలకమైన నాయకులు ఉన్న నేపథ్యంలో వారికి సముచితమైన గౌరవం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ మీద ఘన విజయం సాధించిన తుమ్మల నాగేశ్వరరావుకు, పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి మీద గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధిర అసెంబ్లీ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై విజయం సాధించిన భట్టి విక్రమార్క కు కీలకమైన పదవులు దక్కాయని తెలుస్తోంది. భట్టి విక్రమార్క కు ఉప ముఖ్యమంత్రి పదవి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవులు కేటాయించారని తెలుస్తోంది.
ఇదీ వీరి నేపథ్యం
భట్టి విక్రమార్క ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.. ఒకానొక దశలో విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆయన వర్గం వారు ప్రచారం చేసుకున్నారు. తర్వాత జరిగిన పరిణామాలలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించారని తెలుస్తోంది.
తుమ్మల నాగేశ్వరరావు
1988లో సీనియర్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు టిడిపిలో చేరారు. ఆ తర్వాత సత్తుపల్లి, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు 17 సంవత్సరాలు పాటు మంత్రిగా పనిచేసిన రికార్డు సొంతం చేసుకున్నారు. నీటిపారుదల, ఎక్సైజ్, రోడ్డు భవనాల శాఖలకు మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు.. ప్రస్తుతం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నుంచి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి.. తన సమీప టిడిపి అభ్యర్థి నామ నాగేశ్వరరావు మీద విజయం సాధించారు. అంతేకాదు తన అనుచరులైన మదన్ లాల్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లను వైరా, పినపాక, అశ్వరావుపేట ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన భారత రాష్ట్ర సమితిలోకి వెళ్లారు. ఎంపీ సీటు కేటాయించకపోవడం, ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, పార్టీలో గౌరవం లేకపోవడంతో ఆయన భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి 50 వేల కోట్ల మెజారిటీతో తన సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి మీద విజయం సాధించారు. ఒక జిల్లా నుంచి ముగ్గురికి పదవులు రావడం అనేది ఒక రికార్డుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వీరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా కూడా వ్యవహరించారు.