ఉమ్మడి రాష్ట్రంలో మూడు దశాబ్దాల కిందట ఉన్న ఊపు ఇప్పుడు కమ్యూనిస్టుల్లో కనిపించడం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా సుమారు ఏడేళ్ల కిందటి వరకు అధికారంలో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెండు పార్టీల దుస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజనతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవ్వగా.. కమ్యూనిస్టుల వ్యవహారం కూడా అలానే ఉంది. కమ్యూనిస్టుల వ్యవహారం చేజేతులా నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పేరుకే వామపక్షాలు కానీ.. రాజకీయంగా చూస్తే ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య సఖ్యత లోపించినట్లుగా అర్థమవుతోంది.
ఏ ఎన్నికల్లో అయినా కలిసి పోరాడాలని అనుకుంటున్నా.. మాటల వరకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో కమ్యూనిస్టులు నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నారు. ఒకప్పుడు టీడీపీతో జట్టుకట్టిన కమ్యూనిస్టులు.. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌తోనూ కలిసి రాజకీయాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ టీడీపీ, టీఆర్ఎస్‌తో జట్టుకట్టారు. ఎక్కడా నిలకడైన రాజకీయాలు చేయలేకపోయింది. అయితే.. ఆయా పార్టీలతో జట్టు కట్టినప్పుడు మాత్రం కొన్ని స్థానాల్లో విజయం సాధించినా.. 2014 తర్వాత ఏపీలో అలాంటి పరిస్థితి లేకుండా పోయింది.
విజయవాడ వెస్ట్ నియోజకవర్గం సహా, కర్నూలు, విశాఖ, అనంతపురం జిల్లాల్లో పలు ప్రాంతాలు కమ్యూనిస్టులకు కంచుకోటలు ఉన్నాయి. అయితే.. ఎవరినైతే తిడుతున్నారో, ఏ పార్టీలనైతే విమర్శిస్తున్నారో, వాటితో జట్టుకట్టారు కమ్యూనిస్టులు. దీని ఫలితంగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. 2019 ఎన్నికలప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకున్నా.. ఫలితం రాబట్టుకోలేకపోయారు. ఈ క్రమంలో తమను నమ్మే కార్యకర్తలను పక్కన పెట్టడమూ పార్టీలకు శరాఘాతంలా మారింది. నిజానికి ఒకప్పుడు వీళ్లు ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారు. పేదల పక్షాన ఉద్యమాలు చేసేవారు. అయితే.. రానురాను వారికి ఆ ఛాన్స్ లేకుండా పోయాయి. ఆయా ప్రభుత్వాలే పేదల సమస్యలపై ప్రధాన ఫోకస్ పెడుతున్నాయి. దీంతో కమ్యూనిస్టులకు పెద్దగా పనులు, పోరాటాలు లేకుండా పోయాయి.
తాజాగా జరిగిన మునిసిపల్ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు ఉమ్మడి పోరు సాగించలేదు. సీపీఐ లోపాయికారీగా కొన్ని చోట్ల.. బహిరంగంగా కొన్ని చోట్ల టీడీపీతో పొత్తు పెట్టుకుంది. సీపీఎం మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. ఈ ఎన్నికల్లో సీపీఎం 2 చోట్ల విజయం సాధించగా.. సీపీఐ నాలుగు వార్డులను దక్కించుకుంది. అయితే.. ఓటు బ్యాంకు మాత్రం దారుణంగా పడిపోయింది. ఈ ఎన్నికల్లో సీపీఐకి 0.81 శాతం, సీపీఎంకి 0.80 శాతం ఓటు బ్యాంకు మాత్రమే లభించింది. అదే గత అసెంబ్లీ ఎన్నికల్లో 1 శాతం ఓటు బ్యాంకు సాధించాయి. ఇక, 0.62 శాతం కాంగ్రెస్ ఓటు బ్యాంకు సాధించినా.. ఇది కూడా అసెంబ్లీతో పోల్చుకుంటే 1.5 శాతంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకు దారుణంగా పడిపోయింది. మొత్తంగా చూస్తే అటు కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్ గ్రాఫ్ రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారిపోతోందని అర్థమవుతోంది.