Cabinet Expansion On Telangana: ఏడాదిన్నర క్రితం నుంచి తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని ఊహగానాలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి. అయితే అవి అప్పట్లో ఊహాగానాలకే పరిమితమయ్యాయి.. కొందరు మంత్రులు పరిధి దాటి ప్రవర్తించినప్పటికీ… తమ హద్దులు మీరి వ్యవహరించినప్పటికీ ప్రగతి భవన్ వారిని ఏమీ అనలేదు. దీనిపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా మౌనంగానే ఉంది.. కానీ ఇటీవల కొందరి మంత్రుల వ్యవహార శైలి శృతి మించిన నేపథ్యంలో వారికి చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.. వచ్చే ఏడాది ఎలాగూ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సదరు మంత్రులకు ఉద్వాసన పలికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవాలని కెసిఆర్ భావిస్తున్నట్టు వినికిడి.

ఈటల ను బర్తరఫ్ చేసిన నాటి నుంచి..
ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి తమకు మంత్రి పదవి దక్కుతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు… కొత్త కేబినెట్ సమీకరణాలే లక్ష్యంగా కేసీఆర్ ఎమ్మెల్సీలను భర్తీ చేశారని చర్చ కూడా జరిగింది. అప్పట్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ను ఎమ్మెల్సీ చేశారు.. రాత్రికి రాత్రే కలెక్టర్ గా ఉన్న వెంకటరామిరెడ్డితో పదవీ విరమణ చేయించి ఎమ్మెల్సీ చేశారు. అసలు అవకాశమే లేదు అనుకున్న కడియం శ్రీహరికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వీరందరికీ కూడా మంత్రి పదవులు దక్కుతాయని చాలామంది అనుకున్నారు.. కెసిఆర్ కూడా ఏ క్షణమైనా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.. కానీ ఎందుకనో అది కార్యరూపం దాల్చలేదు.. మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న వారు నీరుగారి పోయారు..
వారితో కెసిఆర్ కు ఇబ్బంది
రాష్ట్ర కేబినెట్లో ఓ ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులు వివాదాస్పదమవుతున్నారు. అయితే ఆ ముగ్గురిని తొలగిస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి.. వాస్తవానికి తెలంగాణ క్యాబినెట్లో ఆరుగురు రెడ్డి మంత్రులు ఉన్నారు.. బడ్జెట్ తర్వాత అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్తారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.. అదే నిజమైతే సంక్రాంతి లోపే కేసీఆర్ మంత్రి వర్గాన్ని సంస్కరించే అవకాశం కల్పిస్తోంది.. పరిస్థితి బాగోలేదు అనుకుంటే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరని, ఒకవేళ అదే జరిగితే మంత్రి వర్గాన్ని విస్తరించే అంశంపై మరోసారి ఆలోచించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.. వైపు సంక్రాంతి తర్వాత జనవరి 3 లేదా నాలుగో వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని భారత రాష్ట్ర సమితిలోని కీలక నాయకులు చెప్తున్నారు.

ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే కెసిఆర్ ఆ పని చేస్తారని ఆయన గురించి తెలిసిన వారు చెప్తున్నారు.. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఆ ముగ్గురు రెడ్డి మంత్రుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.. మరోవైపు వారు ఇటీవల చేసిన వ్యాఖ్యల వల్ల ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా దాదాపుగా మూసుకుపోయాయి.. రేపు మంత్రివర్గం నుంచి తొలగించినప్పటికీ చచ్చినట్టు ఈ పార్టీలోనే పడి ఉండాలి.. వేరే ఆప్షన్ లేకుండా వారికి కేసీఆర్ చేశారు.. పాపం ఇప్పుడు వారి పరిస్థితి అటు కక్కలేరు ఇటు మింగలేరు.