Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టయ్యారు. 15 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. అసలు చంద్రబాబును టచ్ చేయలేరని భావించారు. అరెస్టు చేసినా గంటలు వ్యవధిలోనే బయటకు వస్తారని భ్రమించారు. రిమాండ్ కు తరలించినా ఒకటి రెండు రోజుల్లో బయటపడతారని భావించారు. కానీ గంటలు రోజులుగా మారాయి.. రోజులు వారాలయ్యాయి. అయినా సరే కనుచూపుమేరలో చంద్రబాబుకు రిమాండ్ నుంచి విముక్తి లభించే పరిస్థితి కనిపించడం లేదు. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ పైనే ఇప్పుడు నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ చుక్కెదురు అయితే పరిస్థితి ఏంటన్న దానిపై మాత్రం అంతు పట్టడం లేదు.
ఖరీదైన లాయర్లను పెట్టామని.. మనకు బెయిల్ ఎందుకని.. అలా చేస్తే వైసిపికి మనమే ప్రచార అస్త్రం ఇచ్చినట్టు అవుతుందని తెలుగుదేశం నాయకత్వం భావించింది. చంద్రబాబు బెయిల్ కు దరఖాస్తు చేయరని.. ఏకంగా తనపై కేసును కొట్టించుకునే డైరెక్టుగా బయటకు వస్తారన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే ఆది నుంచి చంద్రబాబు లాయర్లు ఈ కేసులో టెక్నికల్ అంశాలనే నమ్ముకున్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదు. ఆయన అరెస్ట్ కు గవర్నర్ అనుమతి తీసుకోలేదు. అనే అంశాల చుట్టూనే చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు సాగాయి. అందుకే ఏసీబీ కోర్టు తో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో సైతం ఎదురు దెబ్బ తగిలింది.
అసలు ఆధారాలే లేవని చంద్రబాబు న్యాయవాదులు వాదించడం చాలా తప్పు.ఈ కేసుకు మూలమే ఈడి. ఇప్పటికే ఈడి కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా పూర్తి చేసింది. దాని పూర్వపరాలతోనే సిఐడి ఈ కేసులో పట్టు బిగించింది. చంద్రబాబును అరెస్టు చేయగలిగింది. ఏకంగా 15 రోజులు పాటు రిమాండ్ విధించగలిగింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు న్యాయవాదులు వ్యూహం మార్చాలి. అసలు స్కామే జరగలేదు.. అవినీతికి తావు లేదు.. 371 కోట్ల రూపాయల నగదు పక్కదారి పట్టలేదు.. అనే వాదనలు వినిపిస్తే సుప్రీం కోర్టులో సేమ్ సీన్ ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా బయటపడాలంటే ఉన్నది రెండే రెండు ఆప్షన్స్. కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని బలంగా వాదనలు వినిపించడం, రెండు ఆయన వయసు రీత్యా అనారోగ్య సమస్యలను విన్నవించడం చేస్తేనే సానుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసలు అవినీతే లేదని, 17a ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదని వాదిస్తే మాత్రం పాత తీర్పు రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 17 ఏ అనేది 2018లో అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందుగానే ఈ స్కాం జరిగినట్లు సిఐడి బలమైన ఆధారాలను చూపిస్తుంది. దీంతో 17 ఏ వర్తించదని.. గవర్నర్ అనుమతి తీసుకోనవసరం లేదని సిఐడి తరపు న్యాయవాదులు బలంగా వాదించే అవకాశాలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్ కంటే.. ఆయన వయసును సాకుగా చూపి బెయిల్ కి దరఖాస్తు చేసుకుంటేనే సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే మాత్రం సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.