బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు నడుస్తున్నాయి. దేశంలో కరోనా స్ప్రెడ్ అయిన తర్వాత మొట్టమొదటి సారి జరుగుతున్న ఎన్నికలివి. నిన్ననే మొదటి విడత ఎన్నికల పోలింగ్ కూడా పూర్తయింది. మరో రెండు విడతల్లో మిగితా అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
Also Read: అమెరికా ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎంత?
అయితే.. సాధారణంగా బీహార్ అంటేనే కులాల కుమ్ములాటలు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా బీహార్ రాజకీయాల్లో కులాలే కీలక పాత్ర పోషిస్తాయి. ఇక్కడ వెనకబడిన వర్గాలు, దళితులు, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా యాదవులు, ముస్లింలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నారు. యాదవులు, ముస్లింల ఓట్ల సంఖ్యే దాదాపు 30 శాతంగా ఉంది. అందుకే బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలూ ఈ రెండు సామాజికవర్గాలపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తుంటాయి.
గత మూడు దశాబ్దాలుగా ముస్లిం, యాదవుల ఓటు బ్యాంకు రాష్ట్రీయ జనతాదళ్ వైపే ఉంది. గంపగుత్తగా కాకపోయినా ఎక్కువ శాతం ఈ రెండు సామాజకవర్గాల ఓటర్లు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీవైపు మొగ్గు చూపుతుంటారు. ఈసారి కూడా ఆర్జేడీ దీనిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయితే.. ఈసారి ఎలాగైనా బీహార్‌ను మరోసారి చేజిక్కించుకోవాలని చూస్తున్న నితీష్ కుమార్ ఈ సామాజికవర్గాలపై కన్నేశారు. అందుకే ఈ రెండు సామాజికవర్గాలకు సీట్ల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కూటమిలో తనకు కేటాయించిన స్థానాల్లో 19 స్థానాలను యాదవులకు కేటాయించి ఆ ఓటు బ్యాంకును నితీష్ కుమార్ కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక ముస్లిం సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు 11 స్థానాలను జేడీయూ కేటాయించింది. ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు జేడీయూ కేటాయించడం ఇదే ప్రథమమని చెబుతున్నారు.
Also Read: ఎంసెట్ రాసిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!
మరోవైపు మహిళల ఓట్లను రాబట్టేందుకు నితీష్ కుమార్ ప్రత్యేకంగా సీట్లను కేటాయించడం విశేషం. ఇప్పటికే బీహార్ మహిళలు నితీష్ కుమార్ పట్ల కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మద్యనిషేధం అమలు చేస్తుండటంతో మహిళలు మళ్లీ నితీషే సీఎం కావాలని కోరుకుంటున్నారు. అందుకే నితీష్ కుమార్ 22 మంది మహిళలకు ఈ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మహిళలకు 50 శాతం సీట్లను కేటాయించడంతో మహిళా ఓటు బ్యాంకు తనవైపే ఉంటుందని నితీష్ నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద బీహార్ రాజకీయాల్లో ఈసారి కొత్త సంప్రదాయానికి తెరతీస్తారా..? లేక పద్ధతినే అనుసరిస్తారా..? ఆసక్తికరంగానైతే ఉంది.