Modi- Jagan: జగన్ అంటే మోదీకి అందుకే ఇష్టం

బిజెపితో తెలుగుదేశం పార్టీది విడదీయరాని బంధం. భారతీయ జన సంఘం నుంచి బిజెపి ఆవిర్భవించగా.. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది.

Written By: Dharma, Updated On : November 28, 2023 3:44 pm

Modi- Jagan

Follow us on

Modi- Jagan: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులు ఉండరు. కాలానుగుణంగా, పరిస్థితులకు తగ్గట్టు శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులుగా మిగులుతారు.ఒకప్పుడు చంద్రబాబు అంటే మోదీకి చాలా ఇష్టం. గౌరవభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే చంద్రబాబు దూరమయ్యారు. జగన్ దగ్గరగా మారారు. ఈ పరిణామ క్రమంలో జగన్ మరింత ఇష్టుడిగా మారిపోయారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బిజెపితో తెలుగుదేశం పార్టీది విడదీయరాని బంధం. భారతీయ జన సంఘం నుంచి బిజెపి ఆవిర్భవించగా.. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. ఇప్పటివరకు చాలా సందర్భాల్లో ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే బిజెపికి టిడిపి నమ్మదగిన మిత్రపక్షంగా కొనసాగింది. కానీ గత ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా మారి, శత్రుత్వంగా కలహించుకున్నాయి. దీనికి ముమ్మాటికి చంద్రబాబు తప్పిదమే కారణం. ఆ కారణంగానే మోదీ తో తనకున్న స్నేహాన్ని చంద్రబాబు చెడగొట్టుకున్నారు. తన స్థానంలో జగన్ కు అవకాశం ఇచ్చారు.

చంద్రబాబుకు ఒక అరుదైన గౌరవం ఉండేది. రాష్ట్రానికి అంతర్జాతీయ నేతలను సైతం తెప్పించిన ఘనత ఆయనదే. ఆయన ఆత్మీయస్వాగతం, మర్యాదలు స్నేహ సంబంధాలను మరింత మెరుగుపరిచాయి. రాష్ట్రానికి ఎవరైనా అతిధి వస్తున్నారంటే.. వారికి ప్రత్యేకమైన స్వాగతాలతో పాటు ఆత్మీయతను పంచేవారు. అటువంటి చంద్రబాబులో కాలానుగుణంగా మార్పు వచ్చింది. తానే ఒక అతిధిని అన్నట్టు భావన క్రియేట్ అయ్యింది. అదే స్నేహితులకు దూరం చేసింది. టిడిపి ప్రభుత్వ హయాంలో ఓసారి ప్రధాని మోదీ తిరుపతి శ్రీవారి దర్శనానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి మంత్రి దేవినేని ఉమాను పంపించారు.

ఇప్పుడు జగన్ విషయానికి వద్దాం. ఇటీవల తిరుమలలో శ్రీవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగనే స్వయంగా హాజరై ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. గవర్నర్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి బిజెపితో వైసిపికి నేరుగా సంబంధాలు లేవు. ప్రభుత్వాలపరంగా సాయిమందించుకుంటున్నాయి. త్వరలో టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపి వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయినా సరే జగన్ ఇవేవీ మనసులో పెట్టుకోకుండా.. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆత్మీయ స్వాగతం పలికారు. ఆయనతో పాటే ఈ పర్యటనలో కొనసాగారు. జగన్ లో ఈ తరహా విధానాలే ప్రధాని మోదీకి ఇష్టమని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల ముందు నుంచి జగన్ ప్రధాని మోదీకి ఇష్టుడిగా మారిపోయారు. ఇప్పుడు కూడా అదే స్నేహాన్ని కొనసాగిస్తుండడం విశేషం.