Gaddam Prasad Kumar: తెలంగాణ కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఎంపికయ్యారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో ఇద్దరు సీఎంల వద్ద మంత్రిగా పనిచేశారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన గడ్డం ప్రసాద్ వికారాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో సైతం మంత్రి పదవి చేపట్టారు.
గడ్డం ప్రసాద్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. వికారాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన్ను వైయస్ రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2009 ఎన్నికల్లో సైతం అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2012 మంత్రివర్గ విస్తరణలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసిన గడ్డం ప్రసాద్ ఓటమి చవి చూశారు. ఎన్నికల్లో మాత్రం వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో స్పీకర్ పదవిపై రకరకాల చర్చలు సాగాయి. తొలుత సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు పేరు వినిపించింది. అటు బిఆర్ఎస్ తో పాటు బిజెపి దూకుడుగా ఉన్న వేళ అసెంబ్లీని సజావుగా నడిపించాలంటే సీనియర్ నేత అవసరం. దీంతో తుమ్మల వైపు కాంగ్రెస్ పార్టీ చూసింది. కానీ తుమ్మల మాత్రం మంత్రి పదవి వైపే మొగ్గు చూపారు. ఒకరిద్దరూ సీనియర్ల పేర్లు తెరపైకి వచ్చినా.. రకరకాల సమీకరణల దృష్ట్యా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ వైపే కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపింది. ఇప్పటికే మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు అక్కరకు వచ్చింది. పైగా ప్రభుత్వంలో ఎస్సీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.