Pawan Kalyan Sandals: రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. కానీ, వారు ధరించే వస్తువులు ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా ఉంటాయనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ మాత్రం వీదేశీ కంటే స్వదేశీ వస్తువులపైనే ఆధారపడతారని చెబుతున్నారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. తన కాళ్లకు వేసుకునే చెప్పుల గురించి చెప్పిన విషయాన్ని తెలుసుకొని అందరూ నోరెళ్లబెట్టారు.
డబ్బంటే వ్యామోహం లేదని, ఒక సినిమా చేసుకుంటే చాలని హ్యాపీగా ఉండవచ్చని ఎప్పుడూ చెబుతుండే పవన్ కల్యాణ్.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినట్లు మరోసారి స్పష్టం చేశారు. తను ఎక్కువగా యూరోపియన్, అమెరికన్, విదేశీ వస్తువులను వాడుతుంటానని అనుకునే వారికి చెప్పులను కూడా ఆంధ్రలో తయారు చేసినవే వాడతానని ఇటీవల మచిలీపట్నంలో జరిగిన సభలో చెప్పుకొచ్చారు. ఆ చెప్పులు చేసేవి గుంటూరు జిల్లాలోని తెనాలిలోనేని అన్నారు.
పవన్ కల్యాణ్ ధరించే చెప్పుల తయారీదారుడి గురించి అంతగా ఎవరికీ తెలియదు. అంటువంటిది ఆయన స్వయంగా తెనాలికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పిలిచి సన్మానించారు. ఒక లక్ష రూపాయలు అందించారు. తనను ప్యాకేజీ స్టార్ అన్న వాళ్లను చెప్పుతో కొడతా అని చూపించిన చెప్పు ఈయన తయారు చేసిందేనని అన్నారు. తనకు ఎప్పటి నుంచో ఆయన చెప్పులు కుడతారని అవి చాలా గట్టిగా ఉంటాయని ఆ రుచి చూస్తారా అంటూ తనను విమర్శించే వారిని ఉద్దేశించి అన్నారు.
తన అభిమాన నటుడు స్వయంగా పిలిచి సన్మానం చేస్తుంటే వెంకటేశ్వరరావు ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. చెప్పులు కుట్టేవారిని కూడా పవన్ కల్యాణ్ గుర్తు పెట్టుకోవడంపై జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై నెటిజన్లు పవన్ కల్యాణ్ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర కమర్షియల్ యాప్ లలో పవన్ కల్యాణ్ చెప్పల్స్ అంటూ దర్శనమిస్తున్నాయి. వాటి ధర కాస్త ఎక్కువగా ఉన్నా, వాటిని ఎక్కువగానే బుక్ చేసుకుంటున్నారు.