Slowest Train: భారత దేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద రైల్వే వ్యవస్థను కలిగి ఉంది. మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి.. మనల్ని 200 ఏళ్లు పాలించిన బ్రిటిషర్లు మనకు రైలును పరిచయం చేశారు. వారి వ్యాపారం, సరుకుల తరలింపు కోసం రైల్వే లైన్లు నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. బొగ్గు ఇంజిన్ల నుంచి ఇప్పుడు హైడ్రోజన్ ఇంజిన్లు రాబోతున్నాయి. అయితే దేశంలో రైల్వే వ్యవస్థల ఇంత అభివృద్ధి చెందినా.. ఆ రైలు మాత్రం ఇప్పటికీ నెమ్మదిగా నడుస్తుంది. ఒక జర్నీ పూర్తి చేయడానికి ఆ రైలుకు 37 గంటల సమయం పడుతుంది. 111 స్టేషన్లలో ఆగుతుంది. దేశంలో ఎక్కువ స్టాప్‌లు ఉన్న రైలు ఇదే. 1910 కిటోమీటర్లు ప్రయాణిస్తుంది. అదే హౌరా – అమృత్‌సర్ మెయిల్.
111 స్టాప్‌లు..
హౌరా–అమృత్‌సర్ మెయిల్ పశ్చిమ బెంగాల్‌లోని హౌరా నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. దీని ప్రయాణంలో మొత్తం 111 స్టాప్‌లు ఉన్నాయి. ఈ రైలు 1,910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ రైలుకు ఒక ప్రయాణానికి 37 గంటల సమయం పడుతుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కే, దిగే అవకాశం ఈ రైలు కల్పిస్తుంది. పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా మీదుగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఐదు రాష్ట్రాల పరిధిలోని అసన్సోల్, పాట్నా, వారణాసి, లక్కో, బరేలి, అంబాలా, లూథియానా, జలంధర్ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగుతుంది. ఈ పెద్ద స్టేషన్లలో, రైలు సాధారణం కన్నా ఎక్కువ సేపు ఆగుతుంది.
ప్రయాణికులకు వసతి..
ఇక 37 గంటల సుదీర్ఘ ప్రయాణం ఉన్న ఈ రైలు షెడ్యూల్ పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు వసతి కల్పించేలా రూపొందించబడింది. హౌరా నుంచి రాత్రి 7:15 గంటలకు బయల్దేరుతుంది. మూడో రోజు ఉదయం 8:40 గంటలకు అమృత్‌సర్ చేరుకుంది. తిరుగు ప్రయాణంలో అమృత్‌సర్ నుంచి సాయంత్రం 6:25 గంటలకు బయల్దేరుతుంది. మూడో రోజు ఉదయం 7:30 గంటలకు హౌరా స్టేషన్‌కు రీచ్ అవుతుంది. ఇక ఈ రైలు టికెట్ ధర కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. హౌరా–అమృత్‌సర్ రైలులో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.695, థర్డ్ ఏసీ టికెట్ రేటు రూ.1,870, సెకండ్ ఏసీకి రూ.2,755 చార్జి చేస్తారు. ఫస్ట్ ఏసీకి రూ.4,835 వసూలు చేస్తారు. మొత్తంగా హౌరా–అమృత్‌సర్ రైలు విస్తారమైన కనెక్టివిటీని కలిగి ఉంది. ముఖ్యనగరాల మీదుగా ప్రయాణిస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది.