Pawan Kalyan Bus Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దసరా నుంచి సడెన్ గా ఏపీలో బస్సు యాత్ర చేపట్టడం సంచలనమైన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 175 నియోజకవర్గాలను చుట్టేసేలా ఆయన సడెన్ గా ఈ టూర్ పెట్టుకున్నాడు. దీని కోసం కొత్తగా 8 స్కార్పియోలను కూడా కాన్వాయ్ కోసం కొనుగోలు చేశారు. ఉన్నట్లుండి ఇంత అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టడానికి వేరే కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉంది. అయితే జనసేన పార్టీ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళుతూ పార్టీ పటిష్టత కోసం పాటుపడుతోంది.. 2019 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో మాత్రం అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రైతులు, పేదల ఇళ్లల్లో తిరుగుతూ వారికి అవసరమైన సాయం చేస్తున్నారు జనసేన అధినేత పవన్. దీంతో ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరుగుతోంది. జనసైనికులు సైతం ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో జనసేన బస్సు యాత్ర చేపట్టనుంది. అందుకు సంబంధించిన కార్యాచరణను పార్టీ నాయకులు సిద్ధం చేస్తున్నారు. బస్సు యాత్రలో ఏయే అంశాలతో ప్రజలను ఆకట్టుకోనున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఏపీలో ముందస్తు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ ‘గడపగడపకు ప్రభుత్వం’పేరుతో ప్రజల్లోకి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను పంపింది. దీనికి పోటీగా టీడీపీ అధినేత చంద్రబాబు ‘బాదుడే బాదుడే’ అంటూ వైసీపీ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఇక బీజేపీ ‘గోదావరి గర్జన’ పేరుతో రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహించి ఊపు తీసుకొచ్చింది.ఈ ముగ్గురు యాక్టివ్ పాలిటిక్స్ తో ముందస్తు ఎన్నికలకు ముందే సై అంటుండడంతో ఇక పవన్ కళ్యాణ్ సైతం తన సినిమా షూటింగ్ లను ఈ ఐదు నెలల్లో పూర్తి చేసి అక్టోబర్ 5 నుంచి ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రకు కారణం ముందస్తు ఎన్నికలకన్నా మరేదో కారణం అయ్యి ఉంటుందని జనసైనికులు భావిస్తున్నారు.
సభలు, ప్రత్యేక కార్యక్రమాల ద్వారా జనసేన ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది. గత ఎన్నికల్లో పరాభావం తరువాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పవన్ ఆ తరువాత గ్రామాల్లో తిరగడం మొదలుపెట్టారు. మొదట రైతు సమస్యలను తెలుసుకునేందుకు పంటపొలాల వద్దకు వెళ్లారు. రైతుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని నినదించారు. ఇక ఆ తరువాత గ్రామాల్లో, పట్టణాల్లో నెలకొన్న ఇతర సమస్యలపై దృష్టి సారించారు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. కొన్ని గ్రామాల్లో జనసైనికులు సొంత డబ్బులతో రోడ్లు వేయించి ఆకట్టుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైసీపీ ప్రభుత్వం చాలా గ్రామాల్లో రోడ్లు వేసేందుకు నిధులు జారీ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కదిలించిన జనసేన అక్కడితో మరిన్ని సమస్యలపై పోరాడాలని నిర్ణయించుకుంది.
ప్రజలను వంచిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా పలు పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవడానికైనా సిద్ధం అని పలు సార్లు చెప్పారు. అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్.. మరి కలిసివస్తే టీడీపీని కూడా కలుపుకుపోతారా..? అనేది తేలనుంది. ఒకవేళ అలయన్స్ తో ఎన్నికల బరిలోకి దిగితే అన్ని పార్టీలు కలిసి హామీలను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ పవన్ ఇప్పుడే బస్సు యాత్ర చేపట్టడం ద్వారా ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వగలుగుతారన్నది హాట్ టాపిక్ గా మారింది.
జనసేన బస్సు యాత్ర త్వరలో తిరుపతి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా జనసేనకు పట్టున్న 30 నియోజకవర్గాలను ఎంచుకొని ఆయా ప్రాంతాల్లో ఎక్కువ రోజులు సాగేలా ప్లాన్ చేస్తున్నారు. అవసరమైన కొన్ని చోట్ల పాదయాత్ర చేపట్డాలని కూడా జనసేనాని నిర్ణయించారు. గత ఎన్నికల్లో గెలుపు దగ్గరికి వచ్చిన తాను ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచే తీరుతామని చెప్పనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అశాంతి నెలకొందని, ఈ ప్రభుత్వం వెళ్లి కొత్త ప్రభుత్వం వస్తేనే ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పనున్నట్లు జనసేన కేడర్ చెబుతోంది. అందుకోసం ‘జగన్ ఒక్క చాన్స్ ’ లాగానే తమకూ ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరనున్నట్లు సమాచారం.
ఒకవేళ ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ బలంగా తయారుకావాలని చూస్తున్నారు. వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా తానే సీఎం అభ్యర్థిని అన్నట్లుగా ప్రచారం చేయనున్నారు. ఇదే సమయంలో పవన్ ఢిల్లీ వెళ్లి బీజేపీతో పొత్తుపై క్లారిటీ తెచ్చుకోనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై తేల్చుకోనున్నారు. ఆ తరువాతే బస్సు యాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఒకవేళ పొత్తు ఉన్నా.. లేకున్నా పవన్ సొంత ఇమేజ్ తెచ్చుకునేందుకు బస్సు యాత్ర చేపట్టనున్నారని తెలుస్తోది. జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.
పవన్ కళ్యాణ్ ఇక ఒంటరిగానే ఏపీ ఎన్నికల బరిలోకి దూకుతున్నాడు. తన స్టామినా ఏంటో చూపించి జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రజల్లో జనసేనకు ఆదరణ తీసుకురావడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టారు. తద్వారా జనసేన ఓటు బ్యాంకును పెంచడానికి డిసైడ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన బలం నిరూపించి ప్రత్యర్థులనే తన కాళ్ల దగ్గరకు తీసుకొచ్చేలా చేయడానికే ఈ బస్సు యాత్ర చేపట్టినట్టు తెలుస్తోంది. బీజేపీ, టీడీపీల వ్యవహారశైలి కారణంగానే పవన్ కళ్యాణ్ తనేంటో నిరూపించుకోవాలని పట్టుదలతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. మరి జనసేనాని తన బలాన్ని ఎంతవరకూ పెంచుకుంటాడో వేచిచూడాలి.