https://oktelugu.com/

Telangana Budjet 2023 : హరీష్ చెప్పినవన్నీ అబద్ధాలే… తెలంగాణ బడ్జెట్ వెనుక అసలు కోణం ఇదీ

Telangana Budjet 2023 : వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా పట్టించుకోలేదు.. ఆ నమస్తే తెలంగాణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పారు కానీ.. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా సమకూర్చుకుంటారో ఒక్క ముక్క చెప్పలేదు.. ఓ వైపు 2000 కోట్లకు ఇండెంట్ పెట్టుకోవలసిన దుస్థితి. జీతాలకు డబ్బులు సర్దుబాటు చేయవలసిన దుస్థితి.. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం ప్రవేశపెట్టిన మూడు లక్షల […]

Written By: , Updated On : February 7, 2023 / 10:21 PM IST
Follow us on

Telangana Budjet 2023 : వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన మీడియా పట్టించుకోలేదు.. ఆ నమస్తే తెలంగాణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పేరుకు మూడు లక్షల కోట్ల జంబో బడ్జెట్ అని చెప్పారు కానీ.. అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎలా సమకూర్చుకుంటారో ఒక్క ముక్క చెప్పలేదు.. ఓ వైపు 2000 కోట్లకు ఇండెంట్ పెట్టుకోవలసిన దుస్థితి. జీతాలకు డబ్బులు సర్దుబాటు చేయవలసిన దుస్థితి.. ఇలాంటి సందర్భంలో రాష్ట్రం ప్రవేశపెట్టిన మూడు లక్షల కోట్ల బడ్జెట్ హాస్యాస్పదంగా అనిపిస్తుంది.. అంతేకాదు కేటాయింపులు కూడా ఏదో కాగితాల మీద రాసుకుంటూ పోయినట్టే అనిపిస్తోంది. ఈ స్థాయిలో అంకెల గారడి కనిపిస్తున్నా… ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా బడ్జెట్ ను శాస్త్రీయంగా విశ్లేషించలేదు. అసలు ఆదాయంపై ఆశాస్త్రీయ, అడ్డగోలు అంచనాలను విప్పి చెప్పలేదు. ఏ శాఖకు ఎంతో రాసేసి చేతులు, పేజీలు దులుపుకున్నారు.

ఎంతసేపూ అంకెల గారడీ అని విపక్షాలు, ప్రగతిశీల బడ్జెట్ అంటూ అధికారపక్షం పడికట్టు పదాల్ని ప్రయోగించడమే.. దాదాపు ప్రతిపత్రిక ఇది రైతు బడ్జెట్ అని డప్పు కొట్టింది.. కొంచెం ఆంధ్రజ్యోతి మాత్రమే డిఫరెంట్ యాంగిల్ లో ఆలోచించగలిగింది.. అఫ్ కోర్స్ ఈమధ్య అది వాచ్ డాగ్ లా పనిచేస్తోంది. ఒక పత్రికకు ఉండాల్సిన ప్రధాన సోయి అదే.. దాదాపు ప్రతి పత్రిక ఇది రైతు బడ్జెట్ అంటూ డప్పు కొట్టింది. ఇక ఆంధ్రప్రభ అయితే ఏకంగా పద్దు పంట అని హెడ్డింగ్ పెట్టేసింది. సాక్షి, ఈనాడు కూడా అదే మాయలో పడ్డాయి.. రైతు బొమ్మలను గీసి రీడర్స్ ను మాయలో ముంచాయి. సాక్షి అంటే దాసోహం బాపతు. మరి ఈనాడు కు ఏం పుట్టింది?

లోపల పేజీలో నాలుగైదు పేజీల అయోమయ కథనాలు ఉండటం కాదు, బడ్జెట్ స్వరూపాన్ని చెప్పాలి కదా! ఒక ఉదాహరణ చెప్పుకుందాం. హరీష్ ప్రసంగంలో రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉందన్నాడు. కానీ అదే కేసీఆరే కదా బోలెడుసార్లు ధనిక రాష్ట్రమని, ఆర్థికంగా పటిష్టంగా ఉన్నామన్నాడు. విభజన వేళ కొడితే తిప్పి తిప్పి కొడితే 90 వేల కోట్ల అప్పు… అది ఇప్పుడు బడ్జెట్ రుణాలు ప్లస్ కార్పొరేషన్ రుణాలు కలిపితే ఐదారు లక్షల కోట్ల అప్పు. అదేమిటంటే ప్రాజెక్టుల మీద, ఉప యుక్త పనుల మీద ఖర్చు పెడుతున్నామంటారు.

మొత్తం బడ్జెట్లో 2.11 లక్షల కోట్ల రెవెన్యూ వ్యయం కాగా, 37 వేల కోట్లు మాత్రమే పెట్టు బడి వ్యయం. అర్థమైంది కదా, ప్రాజెక్టుల మీద, ఉపయుక్త పనుల మీద పెడుతున్న ఖర్చు శాతం ఎంతో?. మరి తెచ్చిన అప్పులు మొత్తం ఏమవుతున్నాయి? అది పెద్ద సబ్జెక్టు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని ప్రతి పత్రిక రాసుకొచ్చింది. రుణమాఫీకి అవసరమైంది ఎంత? కేటాయింపులు ఎంత? అసలు దాని జోలికే పోలేదు. పంటల బీమా పరిస్థితి ఏమిటి? అదీ కూడా రాయలేదు. మరి రైతు బడ్జెట్, ఊరి బడ్జెట్ ఎలా అయింది?

ఒకటీ రెండు పత్రికలు ఎన్నికల బడ్జెట్ అని రాసి సంబరపడిపోయాయి.. ఏం కొత్త పథకాలు ఉన్నాయి? హామీలు ఇచ్చిన నిరుద్యోగ భృతి మాట ఏమైంది? గిరిజన బంధు ఏమైంది? దళిత బంధుకు గత బడ్జెట్లో 17వేల కోట్లు ఇచ్చారు, కానీ ఖర్చు చేయలేకపోయారు. ఈసారీ అంతే.. ఖర్చు ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం అంచనా వేసుకుంటున్న ఆదాయం వచ్చే మార్గాలు లేవు.. ఈ విషయం ప్రభుత్వం చెప్పదు. హరీష్ రావు చెప్పలేడు. డబుల్ బెడ్ రూమ్ పథకం మటాష్ అయిపోయింది.. అసలే నామమాత్రంగా సాగుతున్న ఈ పథకాన్ని కొనసాగించలేక ఇప్పుడు ఇక మూడు లక్షలు ఇస్తాం, మీరే కట్టుకోండి అంటున్నారు. మూడు లక్షలతో లబ్ధిదారుడు తన సొంత జాగాలో, ఆత్మగౌరవ సూచికలాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టుకోవాలట?!

2021_22 కోసం పెట్టబడిన బడ్జెట్ పరిమాణం 2.30 లక్షల కోట్లు. ఆడిటింగ్ పూర్తయ్యేసరికి దాని పరిమాణం 1.83 లక్షల కోట్లు. అంటే దాదాపు 50 వేల కోట్ల వరకు కోత. ఇప్పుడు ఇది ఏకంగా 2.90 లక్షల కోట్లకు పెరిగింది. అంటే జస్ట్ రెండేళ్లలో కాగితాలపైనే 60 వేల కోట్లు పెంచేశారు. ఇక అసలు ఖర్చు రఫ్ అంచనాల మేరకు 2 నుంచి 2.20 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే ఓ 70 వేల కోట్ల మేరకు కోత అంచనా వేయవచ్చు.

దేశానికి గుణాత్మక మార్పు అందిస్తామంటున్న కేసీఆర్.. రాష్ట్ర ఆదాయం మీద సరిగా అంచనాలు ఉండవా? ఎందుకు ఉండవు? ఆర్థిక శాఖకు అన్నీ తెలుసు.. కానీ బడ్జెట్ అంటేనే మసి బూసి మారేడు కాయ చేయటం. ఎలాగూ బడ్జెట్ ను బట్టి నడుచుకోవడం అనేది ఉండదు కదా. చేతికి ఎముక లేనట్టుగా కేటాయింపులు చూపిస్తారు. తీరా ఖర్చులో అడ్డంగా చతికిల పడిపోతారు. అసలు అంత ఆదాయం ఉంటే కదా! పోనీ ప్రభుత్వం చెప్పినట్టు ఆదాయం ఉంటే ఆఫ్ట్రాల్ 2000 కోట్ల కోసం ఎందుకు ఇండెంట్ పెట్టినట్టు? ఉదాహరణకి కేంద్రం నుంచి గ్రాంట్లుగా 40 వేల కోట్లు లెక్కేసుకుంటే.. 2021_22 లో వచ్చింది 8,600 కోట్లు. ఈసారీ 41 వేల కోట్లను రాసుకున్నారు. ఇంపాజిబుల్ ఫిగర్. 2021_22 లో సొంత పన్నుల ద్వారా ఆదాయం 91,000 కోట్లు. దాన్ని ఇప్పుడు 1.31 లక్షల కోట్లు చూపిస్తున్నారు. అంటే 40 వేల కోట్లు… జీఎస్టీ సొంతంగా వేసే సీన్ లేదు. పెట్రో మండుతోంది. పొగాకు మీద లాభం లేదు. ఇప్పటికే కిక్కు దింపేస్తోంది. ఇంకేమున్నాయి రాష్ట్రం పెంచడానికి, జనం మీద వేయడానికి? నాన్ టాక్స్ రెవెన్యూ 2021- 22 లో 8,800 కోట్లు… దాన్ని ఇప్పుడు 22.8 వేల కోట్లు చూపిస్తున్నారు. కేంద్ర ఆదాయంలో రెండు నుంచి మూడు వేల కోట్లకు మించి అదనంగా రాదు. మరీ 2.16 లక్షల కోట్ల ఆదాయం ఎలా?

మరోవైపు తెలంగాణ నాకు ఇవ్వాల్సిన కరెంటు బాకాయలు ఇవ్వడం లేదని గొడవ చేస్తోంది. 6000 కోట్ల దాకా చెల్లించాలని ఒత్తిడి వస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగంలో చెప్పుకున్నాడు. మరోవైపు ఇంటర్ స్టేట్ సెటిల్మెంట్ ఆదాయం 17,800 కోట్లు వస్తుందని బడ్జెట్ కాగితాల్లో రాసుకున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కే తెలంగాణ బాకీ. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్ గడ్ ఇచ్చేది ఏమీ లేదు. పైగా చత్తీస్ గడ్ కే మనం కరెంటు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాళ్లు కరెంటు సరఫరానే ఆపేశారు. మరి 17,800 కోట్లు ఎవరు చెల్లించాలి మనకు? దీనిని ఎవరు తేల్చారు? ఇలా అనేక అంశాల్లో హరీష్ రావు గణాంకాల కనికట్టు ప్రదర్శించాడు తప్ప ఇది రియలి స్టిక్ బడ్జెట్ కాదు. ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి. అటు చూస్తే మోడీ ఉరుముతున్నాడు. అందుకే ఈ అంకెల గారడీ…