నమ్మకం అనేది అద్దం లాంటిది. ఒక్కసారి ముక్కలైపోతే మళ్లీ అతకదు. ఒకవేళ గమ్ పెట్టి అతికించినా.. రెండు ముఖాలు కనిపిస్తుంటాయే తప్ప.. ఒకే ప్రతిబింబం కనిపించదు. మునుపటి రూపు ఎప్పటికీ రాదు. రాజకీయాల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉంటాయి. తమను నమ్మినవారికి సమయం వచ్చినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తారు. అదే సమయంలో మోసం చేసిన వారిని దగ్గరికి కూడా రానీయరు. ఇప్పుడు సీఎం జగన్ కొందరు నేతల విషయంలో ఇదే వైఖరితో ఉన్నట్టు సమాచారం.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు, ముగ్గురు ఎంపీలు కూడా బయటకు వెళ్లిపోయారు. చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వీరు గోడదూకేశారు. సీన్ కట్ చేస్తే.. 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం సాధించారు. వైసీపీ నుంచి తీసుకున్న అదే 23 మంది మిగిలారంటూ ట్రోలింగులు కూడా నడిచాయి. అయితే.. వెళ్లిపోయిన ఆ 23 మందిలో చాలా మంది మళ్లీ ఫ్యాన్ గాలి కింద సేద తీరుదామని అనుకుంటున్నారట.
ఉత్తరాంధ్ర, కోస్తాకు చెందిన కొందరు నేతలు ఈ విషయంలో సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లతో పైరవీలు చేయించుకుంటున్నారట. ఆ సీనియర్లు ఈ విషయాన్ని అధినేత వద్దకు తీసుకెళ్లారట. అయితే.. వారు చేసిన మోసాన్ని జగన్ మరిచిపోలేదట. వాళ్లు రావాల్సిన అవసరం లేదని చెప్పారట. ఒకవేళ వచ్చినా భవిష్యత్ లో అవకాశాలు, అందలాలూ ఉండవని చెప్పినట్టు సమాచారం.
జగన్ తీసుకున్న ఈ వైఖరి నిజమేనని పలువురు అంటున్నారు. దీనికి సాక్ష్యం కూడా చూపిస్తున్నారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్, కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. వీరిద్దరూ పార్టీ నుంచి వెళ్లిపోయిన వారే. ఎన్నికల సమయం కావడంతో.. ఎవరినీ వద్దని చెప్పలేరుకాబట్టి.. వారిద్దరినీ తీసుకున్నారు. తనను కాదనుకొని వెళ్లిపోయారని జగన్ భావించారేమో.. వారిని ఇప్పటి వరకూ పట్టించుకోలేదు.
అదే సమయంలో.. తనను నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మాత్రం అవకాశాలు ఇస్తున్నారు జగన్. ఇప్పటికే.. డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత, రవీంద్రబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. రామసుబ్బారెడ్డి సైతం లైన్లో ఉన్నారు. ఈ విధంగా.. నమ్మి బయటి నుంచి వచ్చిన వారిని చేరదీస్తున్న జగన్.. తనను మోసం చేసి వెళ్లినవారిని దగ్గరకు కూడా రానివ్వట్లేదని అంటున్నారు.