AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ, ప్రభుత్వ పాలన విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటారు. తప్పు చేస్తే సహించని జగన్ పరిపాలనలో మంచి మార్కులు వేసుకుంటున్న వారికి సైతం అత్యున్నత అవకాశాలు ఇస్తారని పేరు. అయితే ఏపీలో వైసీపీ సర్కారు ఏర్పడి రెండేన్నరేళ్లు దాటుతోంది. ఈ క్రమంలో ముందుగానే సీఎం జగన్ కేబినెట్ లో పనిచేసేవారిలో ఐదేళ్లలో ఇద్దరికి చొప్పున అవకాశం ఇస్తామని ప్రకటించేశారు. అన్నమాటల మాదిరిగానే రెండున్నరేళ్లు అవుతోంది. ఏపీలో కేబినెట్ ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులతో పాటు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను అటు.. ఇటు అన్నట్టుగా మార్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా శాసనమండలిలో 14సీట్లను భర్తీ చేయాలని చూస్తున్నారు. తరువాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలి కేబినెట్ కూర్పులో వ్యూహాత్మకంగా వ్యవరించిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని అనుకుంటున్నారు.

ప్రస్తుతం ఉన్న సీనియర్లతో సహా పలు కీలక మంత్రులను తప్పించి.. వీరందరినీ 2024 ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. వీరిలో పార్టీ.. ప్రభుత్వ వాయిస్ వినిపించేవారితో పాటు సామాజికంగా పక్కా లెక్కలు అమలు చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలో మంత్రి పదవి ఆశిస్తున్న కొందరు కీలక నేతలకు అవకాశం దక్కేలానే కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత శాసన మండలి చైర్మన్ గా టీడీపీ సమయంలో నియమించిన షరీఫ్ కొద్దికాలం వరకు కొనసాగారు. ఆయన పదవీ విరమణ కూడా అయిపోగా.. కొత్త చైర్మన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. మండలి చైర్మన్ అవకాశం ఈసారి ఎస్సీ వర్గానికి ఇవ్వాలని సీఎం జగన్ అనుకుంటున్నట్ల సమాచారం. ఇందులో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషెన్ రాజును ఎంపిక చేసినట్లు సమాచారం. అదే విధంగా డిప్యూటీ చైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన జంగా క్రిష్ణమూర్తి పేరు వినిపిస్తోంది.
కేబినెట్ లోనూ చాలామంది చేరాలని ఆశపడుతున్నారు. ముఖ్యంగా శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం ఈసారి మంత్రి పదవి కోరుకుంటున్నట్లు ప్రచారం. ఇప్పటి వరకు ఆర్థికశాఖను పర్యవేక్షించిన బుగ్గన రాజేంద్రనాథ్ చాలా సీనియర్. పాత మంత్రుల ప్రక్షాళన నేపథ్యంలో ఇతడిని కూడా పక్కన పెడితే.. మళ్లీ సరైన వ్యక్తికి ఆ పదవికి అప్పగించడం అంటే జగన్ కు టాస్కే… ఈ క్రమంలో ఆనం రామ నారాయణ రెడ్డి, సీ రామచంద్రయ్య పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమ నుంచి బలిజ వర్గానికి ప్రాధాన్యత ఇస్తే.. రామచంద్రయ్యకు ఆ అవకాశం దక్కుతుంది. విజయనగరం నుంచి రాజన్న దొర, వీరభద్రస్వామి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. విశాఖ నుంచి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నథ్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం దక్కేలా కనిపిస్తోంది. కాపుకోటా నుంచి దాడిశెట్టి రాజా, బీసీ వర్గం నుంచి పొన్నాడ సతీశ్, కొండేటి చిట్టిబాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి నుంచి ప్రసాదరాజు, గ్రంధి శ్రీనివాస్, బాలరాజు పేర్లు వినబడుతున్నాయి. క్రిష్ణా జిల్లా నుంచి పార్థ సారథి రేసులో ఉన్నారు. జోగిరమేశ్, సామినేని ఉదయబాను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్ రెడ్డి, జంగా క్రిష్ణమూర్తి, ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, పిన్నేళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు వరుసలో ఉన్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి, కాకాని గోవర్దన రెడ్డిలో ఒక్కరికి అవకాశం దక్కనుంది. చిత్తూరు జిల్లా నుంచి ద్వారకా నాథ్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. ఒక్కరికి అవకాశం దక్కనుంది. కడప నుంచి కోరుముట్ల శ్రీరాములు, సీ రామచంద్రయ్య, తదితరుల పేర్లు పరిశీలనలో ఉండగా.. సీఎం జగన్ ఏఏ జిల్లా నుంచి ఎవరికి అవకాశం ఇస్తారో.. వేచి చూడాల్సి ఉంది.