Chandrababu vs Jagan: ‘‘వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఆషామాషావి కాదు.. ఎదుర్కొనే సత్తా ఉండాలి.. పోరాడగలిగిన సత్తువ ఉంటేనే పార్టీలో ఉండండి.. లేకుంటే వెళ్లిపోవచ్చు..’’ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా పార్టీ నాయకులకు చేసిన దిశా నిర్దేశం ఇది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు మరో రెండేళ్ల సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే రాజకీయ వేడి సంతరించుకుంది. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే వ్యూహం పన్నుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఈసారైనా అధికారంలోకి వచ్చేందుకు పార్టీ కార్యర్తలను సమాయత్తమం చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని సూత్రాలను చెప్పిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలు పార్టీకి అగ్ని పరీక్ష లాంటివన్నారు. వైసీపీ రౌడీయిజాన్ని, అరాచకాలన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండాలన్నారు. ఇందులో భాగంగా తాజాగా జరిగిన కుప్పం నియోజకవర్గ ఫలితాలను ఉదహరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని దౌర్జన్యంతో చేజిక్కించుకున్నారని, మరోసారి వైసీపీకి అలాంటి అవకాశం లేకుండా చూడాలన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే ఇబ్బందులు ఎదుర్కున్నామంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్ఠం చేసుకోవాలన్నారు.
నియోజకవర్గ ఇన్ చార్జులు ప్రజల మధ్యే ఉండాలని, వారికి సహాయ సహకారాలు చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. వారంలో మూడు రోజులు నియోజకవర్గంలో పర్యటిస్తూ వారి సమస్యలపై పోరాడాలన్నారు. ప్రజలకు ఏర్పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. జగన్ పార్టీని ఎదుర్కొనే సత్తా ఉన్నవారే పార్టీలో ఉండాలని, అలాంటి వారే పార్టీకి అవసరం ఉందన్నారు. వైసీపీని ఎదుర్కోలేనివారి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
జనవరి 18న ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. మార్చి 29 నాటికి పార్టీ ఏర్పాటై 40 ఏళ్లు పూర్తవుతుండడంతో పాటు ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈనెల 15 లోగా గ్రామ, వార్డు, సచివాలయ కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని.. నాయకత్వ లక్షణాలు ఉన్నవారినే ఎన్నుకోవాలని సూచించారు. అధికార పార్టీ నాయకుల దోపిడీని ఎండగట్టడంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారన్నారు. నిత్యావసర ధరలపై ఈనెల 11న పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
తనను గెలిపించిన కుప్పం నియోజకవర్గంతో చంద్రబాబు పర్యటించనున్నారు. నియోజకర్గ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గాల్లో పర్యటించి ఇలాగే చేయాలని నిర్ధేశించారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన స్థానిక నేతలతో సమావేశం కానున్నారు. అందులో భాగంగానే ఢీ అంటే ఢీ అనే వారికే టిక్కెట్లు ఖరారు చేస్తామన్నారు. ప్రతీ కార్యకర్త వైసీపీని ఎదుక్కొనే ఉద్దేశంతోనే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు కుప్పం నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉండేదని, కానీ వైసీపీ దౌర్జన్యంగా పాలన చేస్తూ ఇక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందన్నారు. వైసీపీ ఆగడాలను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలన్నారు.
మరోవైపు వైసీపీ కూడా తన పాలనలో వేగం పెంచింది. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ఉన్న సమయంలోనే అభివృద్ధి చేసి ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పార్టీ నాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. మొత్తానికి ఏపీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల దూకుడుతో రెండేళ్ల ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఏర్పడిందని అనుకుంటున్నారు.