Viral News
Viral News : వాస్తవానికి బైక్ పై ఇద్దరే ప్రయాణించాలి. కంపెనీలు కూడా వాటిని అలాగే డిజైన్ చేశాయి. కానీ ఇటీవల బైక్ పై ముగ్గురు నలుగురు ఎక్కి ప్రమాదకర స్థితిలో ప్రయాణం చేస్తున్నారు. ఇలా లెక్కకు మించి ఎక్కి ట్రాఫిక్ పోలీసుల కంటపడితే వారికి చలానా వేస్తారు. కొందరు ఈ చలానా తప్పించుకునేందు బైక్ నంబర్ ప్లేట్ మలచడం గానీ లేదా నంబర్ కనిపించడకుండా కవర్ చేయడం కానీ చేస్తుంటారు. ఒక వేళ అలా కూడా పట్టుబడితే చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీసు పై కాస్త కోపం, అసహనం పెంచుకోవడం సహజమే.
ఇలాగే బైక్‌పై ముగ్గురు విద్యుత్ సిబ్బంది వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. దీంతో ‘మేం ట్రాన్స్‌కో సిబ్బంది. డ్యూటీ మీద వెళ్తున్నాం. మాకు ఫైన్ వేస్తారా? మేమేంటో చూపిస్తం’ అంటూ బెదిరించి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. చెప్పినట్లుగానే రెండు రోజులు ట్రాఫిక్ సిగ్నల్‌కు కరెంట్ కట్ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సీఐ వెళ్లి ట్రాన్స్‌కో అధికారులతో చర్చలు జరిపి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ నియమాలు చాలా కఠినంగా అమలు అవుతున్నాయి. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ రూల్స్ ను అధికారులు, ప్రభుత్వాలు కఠినతరం చేశారు. ప్రతేడాది వేలాది మంది ప్రయాణికులు, వాహనదారులు ఈ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కారణంగా ట్రాఫిక్ నిబంధనలు మరింత కఠినతరంగా మారిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అమలు చేసేందుకు అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారులు కూడా ఇచ్చాయి.
అయినప్పటికీ ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా యధేచ్ఛగా వాటిని ఉల్లంఘిస్తున్నారు. అటు ఇటు అయితే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ చేయడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ముప్పులో పెడుతున్నారు. కొన్నిసార్లు వీళ్లు చేస్తున్న తప్పులకు అమాయకులు బలవుతున్నారు. డ్రైవింగ్ నిబంధనలు తెలియకపోవడం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. అయితే, ఇటీవల కాలంలో పోలీసులే పట్టుకోవాల్సిన అవసరం లేకుండా, ట్రాఫిక్ కూడళ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను సైతం పరిశీలించి ట్రాక్ చేసి ట్రాఫిక్ చలాన్లు వేస్తున్నారు పోలీసులు. అలా నిత్యం రూల్స్ అతిక్రమించిన చాలా మంది వాహనదారులకు చలాన్లు పంపడం జరుగుతుంది.