Chandrababu: చంద్రబాబు ఆరోగ్యం పై రకరకాల కథనాలు బయటికి వస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనుకూల మీడియాలో సైతంచంద్రబాబు భద్రత,ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు వెలువడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచే జైల్లో వసతులపై కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. కోర్టు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశిస్తే.. జైలు అధికారులు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో ఇబ్బందులు కలుగజేస్తున్నారని టిడిపి శ్రేణులు అనుమానిస్తూ వచ్చాయి. ఈ తరుణంలో తనకు ప్రాణహాని ఉందని చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తికి సుదీర్ఘ లేఖ రాయడం విశేషం.
చంద్రబాబు ఈనెల 25న 3 పేజీల లేఖను ఏసీబీ కోర్టు జడ్జికి జైలు అధికారుల ద్వారా పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కు సంబంధించి పిటీషన్ తిరస్కరణకు గురైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తికే చంద్రబాబు లేక పంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కొద్దిరోజుల కిందట చంద్రబాబు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. అందుకే తన ఆరోగ్య పరిస్థితి, జైలులో భద్రతపై చంద్రబాబు ఏకంగా న్యాయమూర్తికే లేఖ రాశారు.
ప్రస్తుతం ఈ లేఖ చర్చనీయాంశంగా మారింది. ” నేను జైలుకు వచ్చినప్పుడు అనధికారికంగా వీడియోలు, ఫోటోలు తీశారు. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ తరహా వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. నన్ను అంతమొందించేందుకే వామపక్ష తీవ్రవాదులు కుట్ర పన్నుతున్నారు. కుట్ర పై తూర్పుగోదావరిజిల్లా ఎస్పీకి కూడా లేఖ వచ్చింది. ఈ లేఖ పై ఇప్పటివరకు పోలీస్ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టలేదు” అంటూ చంద్రబాబు లేఖలో పలు అంశాలను పొందుపరిచారు.
ఇటీవల జైల్లో అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. జ్వరాలతో రిమాండ్ ఖైదీలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా జైలులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. కొంతమంది ఖైదీలు వాటిని పట్టుకున్నారు. మొత్తం 2000 మంది ఖైదీల్లో.. 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడిన వారు ఉన్నారు. ఈనెల 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా డ్రోన్ కెమెరా ఒకటి ఎగిరింది. ఈ కారణాలన్నీ చూపుతూ.. చంద్రబాబు తనకు ప్రాణహాని ఉందని న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనిపై టిడిపి శ్రేణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కేసు విచారణలో తాత్సారం చేయకుండా.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.