AP Mlc Elections : టిడిపికి ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ కట్టప్పలు వీరే..!

AP Mlc Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వైసిపి కట్టప్పలు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఓటు ద్వారా తెలియజేసి తమ భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయో అన్న సంకేతాలను ప్రభుత్వానికి ఆ ఎమ్మెల్యేలు ఇచ్చారు. కొద్ది రోజుల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వైసీపీని విమర్శిస్తుంటే, ఓటు ద్వారా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కట్టప్పల మాదిరిగా ఓటుతో పోటేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దెబ్బ మీద దెబ్బ […]

Written By: NARESH, Updated On : March 23, 2023 8:52 pm
Follow us on

AP Mlc Elections : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వైసిపి కట్టప్పలు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని ఓటు ద్వారా తెలియజేసి తమ భవిష్యత్తు అడుగులు ఎలా ఉంటాయో అన్న సంకేతాలను ప్రభుత్వానికి ఆ ఎమ్మెల్యేలు ఇచ్చారు. కొద్ది రోజుల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వైసీపీని విమర్శిస్తుంటే, ఓటు ద్వారా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కట్టప్పల మాదిరిగా ఓటుతో పోటేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది రాష్ట్రంలో వైసిపి పరిస్థితి. మొన్నటికి మొన్న రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన వైసిపికి.. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోను మరో ఓటమి తప్పలేదు. మొన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఝలక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం సొంత ఎమ్మెల్యేలే చావు దెబ్బ కొట్టారు. దీంతో ఏడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుని మొన్న పట్టభద్రుల స్థానాల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారాన్ని తీర్చుకోవాలని భావించిన వైసీపీ పెద్దలకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి కోలుకోలేని దెబ్బ కొట్టారు.

-23 ఓట్లతో విజయం..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం అసెంబ్లీలో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను విజయం సాధించేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉంది. అలాగే మరో నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి గోడ దూకి వైసీపీ పంచన చేరారు. దీంతో వైసిపి అనధికార బలం 155 కు చేరింది. ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. ఏడు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవాలంటే 154 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే సరిపోతుంది. వైసిపికి 154తో పాటు అదనంగా మరో ఎమ్మెల్యే బలం ఉంది. దీంతో సులభంగానే ఏడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటామని వైసిపి భావించింది. అయితే కొద్ది రోజుల కిందట వైసీపీని వ్యతిరేకిస్తూ ఇద్దరు ఎమ్మెల్యేలు బాహాటంగానే విమర్శలు గుప్పించారు. వీరిలో ఒకరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాగా, మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ గూటికి చేరనప్పటికీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రభుత్వ పెద్దలు భావించారు. అయితే, ఈ ఓట్లు తమకే పడేలా ప్రభుత్వం విప్ జారీ చేసింది. అయితే గురువారం జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం అనుమానించినట్లుగా వీరిద్దరే కాకుండా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థి పంచుమర్తి అనురాధ సునాయాసంగా విజయం సాధించింది.

-ఆ కట్టప్పలు వీరే..

ప్రభుత్వ పెద్దలు భావించినట్టుగానే కొద్దిరోజుల నుంచి విమర్శలు గుప్పిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితోపాటు ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు ఓటు వేశారు. వీరితోపాటు ప్రభుత్వంతో పాటే కొనసాగుతూ మరో ఇద్దరు గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు గుద్దేశారు. వీరిద్దరూ వైసీపీ ప్రభుత్వానికి కట్టప్ప మాదిరిగా దెబ్బ కొట్టారని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వీరిలో ఒకరు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కాగా, మరొకరు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని శ్రీదేవి మీడియా ముఖంగా ప్రకటించారు.. వీరిద్దరూ ప్రభుత్వంతో పాటు ఉంటూనే అధికార పార్టీ వ్యతిరేక అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారని మరోవైపు వైసీపీ నేతలు లీక్ చేశారు.. రెండు రోజుల నుంచి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాక్ పోలింగ్ ఈ కార్యక్రమాలకు వీరిద్దరూ హాజరయ్యారు. అయినా గుట్టు చప్పుడు కాకుండా తమ పని పూర్తి చేశారని అంటున్నారు.

-అసంతృప్తితోనే వ్యతిరేక ఓటు..

ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం అక్కడ మరో అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఇంచార్జ్ ను నియమించింది. దీన్ని శ్రీదేవి తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి అసమ్మతితో రగిలిపోతున్న ఆమెను తెలుగుదేశం పార్టీ దువ్వింది. అలాగే, ప్రభుత్వ పెద్దల వైఖరితో విసిగిపోయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అదే బాటలో పయనించారు. ఈయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు ప్రభుత్వ పెద్దలు నిరాకరిస్తున్నారన్న ప్రచారం కొద్దిరోజుల నుంచి జరుగుతోంది. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దలు ఎవరు ఆయనకు భరోసా కల్పించలేదు. దీంతో ఆయన పార్టీకి దూరమవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధకు ఓటు వేసినట్లు చెబుతున్నారు. వీరిద్దరి అసమ్మతను ముందే గ్రహించిన వైసీపీ పెద్దలు వీరిని దారిలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. టికెట్ విషయంలోనూ చివరకు భరోసా కల్పించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. వీరికి ఇచ్చిన ఒక కోడ్ ద్వారా వైసీపీ అభ్యర్థికి ఎవరు ఓటు వేశారన్న విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించినట్లు తెలిసింది. వీరిపై ఇస్తాను ఏవిధంగా చర్యలు తీసుకుంటుందో అన్న చర్చ జోరుగా నడుస్తోంది.