Janasena: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనతో జతకట్టింది. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. బిజెపి విషయంలో స్పష్టత లేదు.వైసిపి ఒంటరి పోరుకే సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రత్యర్థి పార్టీల బలం, బలహీనతలపై పార్టీలు ఒక అంచనాకు వస్తున్నాయి. వాటి కదలికలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థుల విషయమై వైసిపి ఫోకస్ పెట్టడం విశేషం.
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని వైసిపి భావించింది. అందుకుగాను అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. బిజెపి ద్వారా నియంత్రించడానికి ప్రయత్నించిందన్న ప్రచారం జరిగింది. కానీ ఇవేవీ పట్టించుకోని పవన్ చంద్రబాబు జైల్లో ఉండగానే తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు. ఇది సహజంగా వైసీపీకి మింగుడు పడని విషయం. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లేకుండానే పొత్తు కుదరడాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ తరుణంలో పొత్తుపై రకరకాల ప్రచారం మొదలుపెట్టింది. జనసేనకు తెలుగుదేశం పార్టీ ఇవ్వదలుచుకున్న సీట్లు ఇవేనంటూ వైసిపి సోషల్ మీడియాలో ఓ జాబితా హల్చల్ చేస్తోంది. వాటినే విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
జనసేనకు తెలుగుదేశం పార్టీ 25 అసెంబ్లీ స్థానాలతో పాటు 4 ఎంపీ సీట్లు కేటాయించినట్లు తెగ ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే ఒక రాజ్యసభ స్థానంతో పాటు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని ఒప్పందం కుదిరినట్లు టాక్ నడుస్తోంది. క్యాబినెట్లో మూడు కీలక పోర్టు పోలియోలు కేటాయిస్తారని తెలుస్తోంది.ముఖ్యంగా విశాఖ, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరులోనే జనసేనకు తెలుగుదేశం పార్టీ సీట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమకు సంబంధించి తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే జనసేన ఆశిస్తున్నట్లు సమాచారం.
భీమిలి, గాజువాక, ఎలమంచిలి, పిఠాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి గన్నవరం, కొత్తపేట, మండపేట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తూర్పుగోదావరిలోని ప్రత్తిపాడు, అవనిగడ్డ, విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట, తెనాలి, పత్తిపాడు, గుంటూరు, వెస్ట్,సత్తెనపల్లి, తిరుపతి అసెంబ్లీ సీట్లు జనసేనకు కేటాయించినట్లు సమాచారం. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి తిరుపతి, అమలాపురం, నరసాపురం, అనకాపల్లిస్థానాలను ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరిందే కానీ.. ఇంతవరకు సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరగలేదు. ఒక విడత రెండు పార్టీల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. ఇటీవలే చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. ఆయన చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీట్లకు సంబంధించి వారి మధ్య చర్చలు జరగలేదని టిడిపి, జనసేన వర్గాలు చెబుతున్నాయి. పొత్తు కుదరకూడదని భావించిన వైసిపి… సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదనే ఇటువంటి ప్రచారానికి దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని రెండు పార్టీల శ్రేణులు నమ్మవద్దని ఎప్పటికీ నాయకత్వాలు ప్రత్యేక ప్రకటన చేశాయి.