Rosaiah: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య దివంగతులయ్యారు. అనారోగ్య కారణాలతో శనివారం చనిపోయారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన రోశయ్య మితభాషిగా ప్రఖ్యాతి గాంచారు. రాజకీయాలకే కొత్త అర్థం చెప్పారు. ఆర్థిక నిపుణుడిగా ఆయన చూపిన మార్గం అనుసరణీయం. 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక చాణక్యుడిగా పేరు గడించారు. ఏ విషయంలోనైనా పరిణతి సాధించిన నాయకుడిగా ఆయన తనలోని ప్రతిభను చూపించి తనలోని నైపుణ్యాన్ని బయటపెట్టారు.
అనవసర విషయాల్లో తల దూర్చకుండా అవసరమైన విషయాలపై పట్టు వదలకుండా ఎంతో తెలివి ప్రదర్శించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన ఎక్కువగా పట్టించుకోలేదు. దీంతోనే తెలంగాణ రాష్ర్ట కాంక్ష నెరవేరింది. అధిష్టానం దృష్టిలో కూడా ఆయన ఓ నిపుణుడైన రాజనీతిపరుడిగా ఖ్యాతి గడించారు. రాజకీయ వ్యవహారాల్లో ఆరితేరిన రోశయ్య ముఖ్యమంత్రిగానే కాకుండా తమిళనాడు గవర్నర్ గా కూడా సేవలందించడం విశేషం.
ఎప్పుడు కూడా తనకు పదవులు కావాలని అడగలేదు. అవి ఆయన ఇంటికే నడిచొచ్చాయి. అంతటి ప్రావీణ్యం కలిగిన పరిణతి చెందిన నాయకుడిగా రోశయ్యకు పేరుంది. కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన నాయకుడిగా అధిష్టానం కనుసన్నల్లో మెలగడం తెలిసిందే. అధిష్టానం కూడా ఆయనకు సరైన పదవులు ఇచ్చి ప్రాధాన్యం కల్పించింది.
Also Read: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కత్తితో పొడిచి కుర్చీ లాక్కునే వాడిని.. చంద్రబాబుతో రోశయ్య వ్యాఖ్యలు వైరల్
సోనియాగాంధీకి విధేయుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తనదైన శైలిలో దూసుకుపోతూ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. వైఎస్ మరణం అనంతరం కూడా అధిష్టానం తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా పోషించారు. వ్యూహాత్మకంగా వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆయనకు సాటి లేరు. ఇంతలా పార్టీలో ప్రాధాన్యత కలిగిన నాయకుడు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోవడం బాధాకరమే.