BRS Victory Chances : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి ఘట్టం ప్రారంభమైంది. నోటిఫికేషన్ రావడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. మరోవైపు ఈసారి ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అదే సమయంలో ఈసారి ఎలాగైనా బీఆర్‌ఎస్‌ను గద్దె దించాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ ఎన్నికల రేసులో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేందరికీ టికెట్లు కేటాయించిన కేసీఆర్.. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపోటములను రెండు అంశాలు నిర్దేశిస్తాయంటున్నారు విశ్లేషకులు అందులో ఒకటి వ్యతిరేకత, రెండోది అసహనం.
రెండుసార్లు పట్టం..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన పార్టీగా భారత రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)ను ఇప్పటికే రెండుసార్లు గెలిపించారు. సరికొత్త విధానాలతో, అబ్బురపరిచే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం అని పాలక పక్షం చెబుతున్నా ఈ ఎన్నికల్లో మాత్రం ఏదో శక్తి అధికార పార్టీని వెనక్కు లాగుతున్నట్లు కనిపిస్తోంది. అదే ప్రభుత్వ వ్యతిరేకత. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి అదే ఎమ్మెల్యేలు కొనసాగుతుంటడం తొమ్మిదిన్నరేళ్ల కాలంగా ఎమ్మెల్యేపై ప్రజల్లో కూడగట్టుకున్న ఆగ్రహం నియోజకవర్గాల్లో వారు సాగిస్తున్న అరాచకంతో ప్రజల్లో అసహనం కూడా పెరిగింది. దీంతో ఈ రెండు అంశాలు ఈసారి బీఆర్‌ఎస్ గెలుపును శాసిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పథకాలపై వ్యతిరేకత..
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వం అన్నాక కొన్ని సమస్యలు ఉంటాయనే భావన కనిపిస్తోంది. కేసీఆర్ బాగానే చేస్తున్నారన్న సంతృప్తి ఉంది. అయితే ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. మరోవైపు స్థానికి నాయకులపై ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
అయినవాళ్లకే పథకాలు..
కేసీఆర్ నేరుగా మాకు పైసలిస్తున్నడు. రైతులకు రైతు బంధు వస్తోంది. ముసలోళ్లకు పింఛన్ వస్తుంది. లగ్గమైన, పిల్లలు పుట్టినా దేనికదే పైసలిస్తున్నడు. ఏమేం కావాలో కేసీఆర్ కు అన్నీ తెలుస్తుండు ఓటు ఆయనకే వేస్తం అని పథకాల లబ్ధిదారులు ఆలోచిస్తున్నా.. పదేళ్ల పాలన తర్వాత ఇంట్లో నుంచి ఇస్తుండా…జేబులో నుంచి ఇస్తుండా.. అన్న భావన ఏర్పడింది. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు పథకాలను అయిన వారికే అందిస్తున్నారు. ఒక్క రైతుబంధు మినహా మిగత పథకాలన్నీ పైరవీ లేనిదే అందడం లేదు. మరోవైపు దళితబంధు, బీసీబంధు, మైనారిటీ బంధులో కమీషన్, డబుల బెడ్రూం ఇళ్లలో డబ్బుల వసూలు, రైతుబంధు ఇచ్చిన మిగత పథకాల కోత, ధాన్యం తూకంలో కోత, ఇలా అన్నీ ప్రజల నుంచి తీసుకుని మళ్లీ పంచుతున్నారన్న అభిప్రాయం తెలంగాణ సమాజంలో బలంగా నెలకొంది.
రూ.10 వేలు ఇచ్చి రూ.15 వేలు గుంజుతుండు..
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ఇస్తున్నామని చెబుతోంది. కానీ వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉంది. 2014 ముందు వరకు రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, ప్ప్రింక్లర్లు, బింధు సేద్యం పరికరాలు అందేవి. ట్రాక్టర్లు కూడా సబ్సిడీపై ఇచ్చేవారు. నాగళ్లు, ట్రాక్టర్లకు అవసరమైన ప్లౌ, పళ్ల నాగళ్లు ఇచ్చేవారు. వాటన్నింటిని లెక్కిస్తే రూ.15 వేలకు పైగానే ఒక రైతుకు లబ్ధి జరిగేది. మరోవైపు ధాన్యం కోత ఉండేది కాదు. కానీ ఇప్పుడు రైతుబంధు పేరుతో సబ్సిడీలు పూర్తిగా ఎత్తేశారు. ఇక ధాన్యం కోత పేరుతో క్వింటాల్‌కు 5 కిలోల చొప్పున కోత విధిస్తున్నారు. అంటే ఎకరా రైతు సాగు చేసిన పొలంలో 30 క్వింటాళ్ల ధాన్యం పండుతుంది. క్వింటాల్‌కు 5 కిలోల చొప్పున 30 క్వింటాళ్లకు క్వింటాల్ నర ధాన్యం కోత పెడుతున్నారు. అంటే ధాన్యం ధర ప్రకారం రూ.2,500 తిరిగి రైతు నుంచి వసూలు చేస్తుంది సర్కార్. దీంతో రైతుబంధుగా ఇచ్చిన రూ.5 వేలలో రూ.2,500 తిరిగి లాక్కుంటుంది. ఇది ఎకరా లెక్క మాత్రమే అదే సమయంలో సబ్సిడీ పేరిట రూ.15లకు కోత పెట్టింది.
ఒక్క పెన్షనర్లే అనుకూలం..
ప్రస్తుత పరస్థితిలో తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నది ఎవరైనా ఉన్నారంటే అది పెన్షనర్లే. తెలంగాణకు ముందు వరకు రూ.500 మించి ఎవరికీ పెన్షన్ రాలేదు. కానీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అది రూ.1000 తర్వాత రూ.2000, ఇప్పుడు రూ.3000 అయింది. దానిని రూ.5 వేలుచేస్తానని కేసీఆర్ అంటున్నారు. దీంతో పెన్షన్ పొందుతున్నవారు మాత్రమే బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నారు.
నిరుద్యోగులు..
తెలంగాణలో నిరుద్యోగులు అయితే గులాబీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడంతో ఓట్లు వేశారు. కానీ ఈసారి నినుద్యోగు భృతి లేదు, ఉద్యోగాల భర్తీ లేదు. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లు పేపర్ లీకేజీతో రద్దవుతున్నాయి. రాసిన పరీక్షలకు ఫలితాలు రావడం లేదు. పదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టకపోగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. పదవీవిరమణ వయసు మూడేళ్లు పెంచారు. దీంతో నిరుద్యోగులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు.
ఉద్యోగులు..
ఇక ఉద్యోగులదీ అదే పరస్థితి తెలంగాణలో ఉద్యోగులకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పారు కేసీఆర్. కానీ ఉన్న జీతాలే సక్రమంగా ఇవ్వలేని స్థాయికి తెలంగాణను తీసుకువచ్చారు. దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో ప్రతీనెల ఉద్యోగులకే వేతనాలు సక్రమంగా రావడం లేదు. పైగా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ బకాయిలు చెల్లించడం లేదు.
ఇలా అన్నివర్గాల ప్రజలూ ప్రభుత్వంపై వ్యతిరేకత, అభ్యర్థులపై అసహనంతో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడితే ఈ రెండే ప్రధాన కారణమవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.