Telanagana Congress : అధికార బీఆర్‌ఎస్‌తో చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నారు. ప్రజలంతా తమను గెలిపించడానికి సిద్ధమయ్యారంటున్నారు. అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అయితే ఏకంగా ఫలానా రోజున కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారంటూ తేదీ, టైమ్ కూడా ప్రకటిస్తున్నారు. ఇన్ని బాగున్నప్పటికీ.. అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే.. కాంగ్రెస్ అధిగమించాల్సిన సవాళ్లేన్నో ఉన్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.. అధికార పార్టీకి ఉన్న వనరులు, కొన్ని అనుకూలతలు కాంగ్రె్‌సకు ఉండవని, దీనికితోడు నేతల అనైక్యత, టికెట్లు దక్కని వారి నిరసనలు వంటివి ప్రతికూలమైన అంశాలుగా ఉన్నాయి. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల వాతావరణమే ఉన్నా.. ఈ సవాళ్లన్నింటినీ పార్టీ ఎలా ఎదుర్కొంటుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం తాము అన్ని విషయాల్లోనూ వ్యూహాత్మకంగానే వెళుతున్నామని చెబుతున్నారు.
అక్కడ పుంజుకున్నది
కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహ బూబ్ నగర్ జిల్లాల్లో బలమైన ఓటు బ్యాంకు ఉంది. 2014, 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సగానికి పైగా సీట్లు ఈ జిల్లాల నుంచే వచ్చాయి. 2014లో కాంగ్రె్‌స్‌కు 21 సీట్లు వస్తే.. అందులో 16 సీట్లు ఈ నాలుగు జిల్లాల నుంచే ఉన్నాయి. అలాగే 2018 ఎన్నికల్లో గెలిచిన 19 సీట్లకుగాను 13 సీట్లు ఈ నాలుగు జిల్లాల నుంచే వచ్చాయి. ఈ జిల్లాల పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనను అధిష్ఠానం ప్లాన్ చేసింది. అయితే తామే ఊహించని స్థాయిలో రాహుల్‌కు ఈ జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కనీసంగా జిల్లాకు 8 చొప్పున.. సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో ఇలా..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రె్‌సకు గెలుపు పెద్ద సవాల్‌గా మారనుందన్న అభిప్రాయాలున్నాయి. ఇక్కడ ఉన్న 24 స్థానాల్లో మజ్లిస్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు స్థానాలు పోను.. మిగిలిన 18లో కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రె్‌సకు బలమైన అభ్యర్థులు కనిపిస్తున్నారు. దీంతో ఈ పరిస్థితిని అధిగమించాల్సిన సవాలు తమ ముందు ఉందని పార్టీ నేతలు అంతర్గతంగా అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి రెండు అంశాలు ఇక్కడ తమకు కలిసొస్తాయంటున్నారు. మైనారిటీలు గతంలోలాగా వేస్తే మజ్లి్‌స్‌కు, లేకుంటే బీఆర్‌ఎ్‌సకు అనే పరిస్థితి లేదని, వారు కాంగ్రెస్ వైపునకు మెగ్గు చూపుతున్నారని చెబుతున్నారు.
సెంటిమెంట్ ఎటువైపు
కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే 2014, 2018 ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో నిర్మాణం లేకున్నా.. అప్పటి పరిస్థితుల్లో తెలంగాణ సెంటిమెంటే ఆ పార్టీని గెలిపించిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, యువత, తెలంగాణవాదులు ఆ విజయంలో కీలక పాత్ర పోషించారంటున్నాయి. అయితే టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎ్‌సగా మార్చడం, తెలంగాణ వాదులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు తెలంగాణ సెంటిమెంట్ వర్కవుట్ కాదని వారు చెబుతున్నారు. పైగా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందన్న సానుభూతి ఈ వర్గాల్లో క్రమంగా పెరుగుతోందని గుర్తు చేస్తున్నారు.