AP Free Ration: కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల లేనట్టేనని తెలుస్తోంది. కొవిడ్ విపత్కర పరిస్థితులు ద్రుష్ట్యా కేంద్ర ప్రభుత్వం ప్రతీ నెల ఉచితంగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో సవ్యంగా అందిస్తున్న ఏపీ సర్కారు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. కుంటి సాకులు చూపుతూ కొర్రీలు వేస్తోంది. నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. నాన్ సార్టెక్స్ బియ్యం లేవనే కారణంతో ఏప్రిల్‌లో ఉచిత కోటా ఇవ్వలేదు. ఈ నెలలోనూ పంపిణీపై స్పందించడం లేదు. రెగ్యులర్ కోటా పంపిణీ ముగుస్తున్నా రేషన్ షాపులకు ఇంకా ఉచిత కోటా బియ్యం సరఫరా చేయలేదు. దీంతో ఈ నెలలో కూడా ఉచిత కోటా లేనట్టేననే ప్రచారం జరుగుతోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు దీనిపై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో దాదాపుగా రెండేళ్ల నుంచి కేంద్రం దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఇందుకోసం రాష్ట్రాలకు ధాన్యం లేదా నగదు ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ ధాన్యం పండించే రాష్ట్రం కావడంతో ఇక్కడి ప్రభుత్వమే బియ్యం పంపిణీ చేస్తోంది. అందుకుగాను కేంద్రం రాష్ట్రానికి నగదు ఇస్తోంది. ఉచిత కోటా మార్చి నెలతో ముగియాల్సి ఉండగా కేంద్రం మరోసారి ఐదు నెలలు పొడిగించింది. దీంతో రెగ్యులర్ కోటాతో పాటు ఉచిత కోటా కూడా ఇవ్వాలి. అయితే సార్టెక్స్ చేయని బియ్యం లేవనే కారణంతో ఏప్రిల్‌లో ఉచిత కోటా పంపిణీ చేయలేదు. రెండు నెలల బియ్యం కలిపి మేలో ఇస్తామని గత నెలలో పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇప్పుడు మే నెల వచ్చినా ఇంతవరకూ రేషన్ షాపులకు ఉచిత కోటా బియ్యం సరఫరా చేయలేదు.

స్పష్టత కరువు
రేషన్ లబ్ధిదారులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు మే నెలకు సంబంధించి ఉచిత రేషన్ బియ్యం ఇస్తారా? లేదా? అనే స్పష్టత కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ నెల కూడా ఉచిత కోటా ఉండకపోవచ్చని డీలర్లు తేల్చిచెబుతున్నారు. ఉచిత కోటా బియ్యం విషయంలో జగన్ ప్రభుత్వం తొలి నుంచీ ఆసక్తి చూపడం లేదు. రెగ్యులర్ కోటాలో సార్టెక్స్ చేసిన బియ్యం ఇస్తోంది. కేంద్రం ఇచ్చే ఉచిత కోటాకు వచ్చేసరికి సార్టెక్స్ చేయని బియ్యం పంపిణీ చేస్తోంది. నాణ్యమైన బియ్యం హామీ అమలులో భాగంగా వైసీపీ ప్రభుత్వం సార్టెక్స్ పేరుతో నూకలు పూర్తిగా వేరుచేసిన బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. వాటికే నాణ్యమైన బియ్యం అనే పేరు పెట్టింది. అందుకోసం స్వల్పస్థాయిలో అదనపు భారం పడుతోంది. మరోవైపు మిల్లులన్నీ సార్టెక్స్ చేసిన బియ్యాన్నే పౌరసరఫరాల శాఖకు సరఫరా చేస్తున్నాయి. దీంతో పౌరసరఫరాల శాఖ వద్ద నాన్ సార్టెక్స్ బియ్యం నిల్వలు లేవు. సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యం ఉచిత కోటాలో పేదలకు ఇవ్వకూడదని భావించిన ప్రభుత్వం ఉచిత కోటాను ఆపేసింది. కొత్తగా సేకరిస్తున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, సార్టెక్స్ చేయని బియ్యాన్ని తెప్పించుకుని సరఫరా చేయాలని భావిస్తోంది. దీనికి చాలా కాలం పడుతుంది.
వివక్ష ఎందుకు?
దేశంలో ఎక్కడాలేని విరుద్ధ పరిస్థితులు ఏపీలో దాపురించాయి. రాష్ట్ర కోటా విషయంలో ఒకలా… కేంద్రం అందించే బియ్యం విషయంలో మరోలా వ్యవహరిస్తోంది. ఎన్నికలకు ముందు సన్నబియ్యం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దాన్ని అమలు చేయలేక చివరికి నాణ్యమైన బియ్యం అనే విధానం తెచ్చారు. నూక వేరు చేసి, కొంత పాలిష్ చేసి నాణ్యమైన బియ్యం అంటూ పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా కోటాలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత లేని, సార్టెక్స్ చేయని బియ్యం పంపిణీ చేస్తోంది. అంటే ఒకే నెలలో ఒక కోటాలో నాణ్యమైన బియ్యం తినే ప్రజలు, మరో కోటాలో నాణ్యత లేని బియ్యాన్ని తినాలనే విచిత్రమైన విధానం అమలు చేస్తోంది. దీంతో రెగ్యులర్ కోటా బియ్యాన్ని తినడానికి ఉపయోగించుకుంటున్న పేదలు రెండో కోటా బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే నగదును ఎంచక్కా మళ్లిస్తున్న ప్రభుత్వం బియ్యం పంపిణీ విషయానికి వచ్చేసరికి మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. ప్రస్తుతం రెండో వారం దాటడంతో ఈ నెల బియ్యం పంపిణీ లేనట్టేనని పేదల లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: NTR Acting: ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిపోయిన కళాతపస్వి !