Social trends: మగాడు చేస్తే తప్పులేదు.. కానీ అదే పని ఆడవాళ్లు చేస్తే తప్పుగా చూస్తుంది లోకం.. మగాడు ఎంత మందితో అయినా ఎఫైర్ పెట్టుకోవచ్చు. కానీ ఆడవాళ్లు పెట్టుకుంటే ఆమెను చూసే చూపు వేరు. సమాజంలో ఆడ, మగలకు మధ్య ఇంత తేడా ఎందుకొచ్చింది? అసలు తప్పు తప్పే కదా? ఆడవాళ్లే ఎందుకు దోషిగా కనిపిస్తున్నారు?నెట్ ఫ్లిక్స్ లో ‘నవరస్’ అని ఒక స్క్రిప్ట్ ఉంది. నవరసాలలో రౌద్రం ఒకటి. అరవింద స్వామి స్క్రిప్ట్, డైరెక్షన్ లో ఇది తెరకెక్కింది. భర్త మరొక స్త్రీ తో కాపురం చేస్తుంటే, 14సంవత్సరాల కూతురు, 18సంవత్సరాల కొడుకుతో ఒక మహిళ ఇండ్లల్లో పాచిపనులు చేస్తూ పిల్లలను పోషిస్తూ ఉంటుంది. కానీ పిల్లల అవసరాల కోసం డబ్బులు కావాల్సి ఉండి, ఒక వడ్డీ వ్యాపారిని ఆశ్రయిస్తే, అతడు తన కోర్కె తీరిస్తే డబ్బులు ఇస్తా అంటాడు. పిల్లల పైన ఉన్న ప్రేమ, వారి అవసరాలు ఆమెను అతనికి లొంగి పోయేలా చేస్తాయి. అది చూసిన కొడుకు, కోపంతో వడ్డీ వ్యాపారిని చంపుతాడు. అమ్మ అలా చేసింది అని కూతురు తల్లి కడ చూపు కూడా చూడ డానికి నిరాకరిస్తుంది.
అవును సమాజం దృష్టిలో తన కన్న పిల్లల దృష్టిలో ఆమె పతిత. ఆమె వలన సమాజంలో తమ గౌరవ మర్యాదలకు భంగం కలిగాయి అని పిల్లలకు కోపం. సహజమే కదా? ఆమె అలా చేయడం తప్పే కదా అని అందరూ తీర్పు ఇస్తారు. నిజానికి ఇక్కడ ఒక రెండు విషయాలను పరిశీలిస్తే ఇందులో తప్పు వ్యక్తిగతంగా ఆమేదా లేక స్వార్థ పూరిత సమాజానిదా అని అర్థం అవుతుంది. అవి 1. ఆర్థికం.2. అవసరం.
ఆర్థికం:- ఈ కథలోనే సరైన భోజనం లేక, కాళ్ళకు చెప్పులు లేక పిల్లలు బాధ పడటం చూపుతారు. మరో వైపు అలివి గానీ సంపద అనుభ వించే వారు కనబడుతారు. మానవ సమాజం నాగరికరింపబడిన క్రమం ఎట్లెట్ల అయితే ప్రస్తుత సమాజ భాషలో అభివృద్ధి పొందుతూ పోయిందో, ఆస్తి పోగు బడుతూ పోయిందో ,ఆ పోగు బడ్డ సంపద స్వంత ఆస్తి అయ్యిందో, ఆ స్వంత ఆస్తి కూడా పురుషుల ఆధిపత్యంలోకి వెళుతుంది. అలా తన ద్వారా పుట్టిన సంతానానికే తన ఆస్తి చెందాలి కనుక , తనతో జత కట్టిన స్త్రీ మరొకరి పొందుకోరడం సరికాదని, ఆలా జరిగితే పుట్టిన పిల్లలు ఎవరి సంతానమో తెలియదు కనుక నా ఆస్తి నా పిల్లలకే చెందాలన్నది భావన. కనుక స్త్రీ ఒకే పురుషునితో సాంగత్యంలో ఉండాలనే షరతులు స్త్రీల పై విధించారు.
ఎంగిల్స్ రాసిన కుటుంబం, ఆస్తి, రాజ్యం పుస్తకం లో ఈ విషయాలు చాలా వివరంగా ఉన్నాయి. అలాగే రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా సే గంగాలో కూడా వివరంగా ఉంది. ఒక గుంపులోని స్రీలు ఆ గుంపులోని అందరు పురుషులకు భార్యే. అలాగే ఒక గుంపులోని పురుషులు అందరు స్త్రీలకు భర్తలే. జనటిక్ సమస్యలు గ్రహించిన గుంపులు తమ గుంపులో కాకుండా మరొక గుంపులోని వారితో సంపర్కం ఏర్పాటు చేసుకున్నారు. సరిపోయినంత మంది పురుషులు లేని చోట ఒకే పురుషుణ్ణి, ఒకరి కంటే ఎక్కువ స్త్రీలు పంచుకున్నారు. అలాగే సరిపోయినంత మంది స్త్రీలు లేని చోట ఒకే స్త్రీని ఎక్కువ పురుషులు పంచుకున్నారు. ఇదే దృష్టాంతాల అవశేషాలు, మనకు భారతంలో ద్రౌపది, కృష్ణుడి కథల్లో కనిపిస్తాయి. టిబెట్ లోని భౌగోళిక పరిస్తితి కారణంగా ఒక స్త్రీని ఇద్దరు ముగ్గురు పురుషులు పెళ్లాడుతారట. అలా అయితేనే పుట్టిన పిల్లలను పోషించుకోగలుగుతారట.
మధ్య యుగాల్లో స్వంత ఆస్తి, రంగు , రూపు, రేస్, క్రీడ, వివక్షతల కారణంగా స్త్రీకి పాతివ్రత్యం అంట గట్టి ఇనుప కచ్చడాలు తగిలించారు. దానికి అనేక కథలు, వ్రత కృత్యాలు, కల్పించి మనుషుల మెదడుల్లో బలమైన భావనలు ముద్ర వేశారు. అవే నేటికీ చట్టాలుగా ఏర్పడి, స్త్రీ పురుషుల మధ్య సంబంధాలకు నైతిక,అనైతిక, రూల్స్ రూపొందించారు. పురుషులకు మాత్రం మినహాయింపులు ఉంటాయి. చట్టం అందరికీ ఒకటే అంటారు. కానీ చట్ట సభల ప్రతినిధులను సామాన్యుల లాగా నేరం చేస్తే దోషులుగా నిలిపి నట్లు నిలుపకుండ రక్షణ చట్టాలున్నాయి. నిజానికి బిచ్చగాళ్ల కూడా వినియోగ వస్తువులు వాడి టాక్స్ కడుతారు కానీ వాళ్ళను టాక్స్ పేయర్స్ అనడం లేదు . సంపన్నులైన టాక్స్ పెయర్స్ కు మాత్రం ఎన్నో సౌకర్యాలు.
సరే, స్త్రీ లకు నియంత్రణ లేకుంటే, అమ్మ తనానికి అపకారం జరుగుతుంది అని నాగరిక సమాజం. స్త్రీకి బాల్యం నుండి పండు పండి రాలిపోయే దాకా పురుషుణ్ణి కాపలా పెట్టింది. కనుక మన కథలో ఆ మహిళను దోషిగా చేసి చూయించారు. కానీ అందులో ఆమె దోషం నిజంగానే ఉందా అనీ మనం ఆలోచించాలి.
2.ఆర్థికం:- ఆహార సేకరణ దశలో సేకరించిన ఆహారాన్ని అందరు పంచుకొని తిన్నారు. ఆహారం ఉత్పత్తి ప్రారంభం అయినా తర్వాత కూడా స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ దాకా ఉత్పత్తి అయిన అన్ని సరుకులను ఎవరి అవసరం మేరకు వారు వాడుకొని సమాన సామాజిక హోదాతో జీవించారు. బానిస వ్యవస్థ తర్వాత మిగులు ఉత్పత్తిని పోగేసుకున్న సంపన్న వర్గం ఆవిర్భవించిన తర్వాత శ్రామిక వర్గానికి వాటా తగ్గుతూ వచ్చింది. పారిశ్రామిక విప్లవం తర్వాత ఇప్పుడు సంపద మరింత కేంద్రీకృతం అయి, ఒక వైపు పేదలకు,మరో వైపు స్త్రీలకు వారిని సంపద నుండి సౌకర్యాల నుండి వారి మానవ సహజ హక్కుల నుండి దూరం జేసే విధానం జరుగు తోంది. సంపన్నుల సంపదకు మరింత రక్షణ గా చట్టాలు తెస్తున్నారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా సనాతన వాదులు సాంప్రదాయాల పేరిట తాలిబాన్ల వలె మహిళలను తమ భోగ వస్తువులుగా భావిస్తూ మధ్య యుగాల నాటి పద్దతులు, సనాతన ధర్మం,సాంప్రదాయాల పేరుతో స్త్రీలను కట్టడి చేస్తున్నారు.
ఈ ధర్మాలు, నీతులు, నైతికాలు, అన్నీ కూడా బలహీనులను బంధించి ఉంచడానికి బలవంతులు ఏర్పాటు జేసిన ఇనుప కచ్చడాలు అని గుర్తించాలి. పురుషులు స్త్రీలను తాము అనుభవించే వస్తువులుగా , తమ వస్తువు తమకే చెందాలి అన్న పోసేసివ్ నెస్ తో ఆలోచిస్తూ దానికి న్యాయం,ధర్మం అనే మెరుపు వరుకులను చుడుతున్నారు. అలాగే అందరికీ చెందాల్సిన సహజ వనరులను అన్నీ అలవి గాకుండా వినియోగించి , సృష్టింప బడ్డ సంపదకు తామే హక్కుదార్లమని వారు భావిస్తూ అందరూ అలాగే భావించాలని సాంస్కృతిక దాడి చేస్తున్నారు. ఈ విషయాల పైన సమాజం లో విస్తృత చర్చ జరగాలి. కనీసం దళిత బహుజనులు, మహిళలు అయినా తమ తమ కట్టు బానిసత్వం నుండి బైట పడే చదువులు చదవాలి.