Manmohan Singh Passed Away: డాక్టరేట్ చేసిన తొలి భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ రికార్డు సృష్టించారు. నాడు ఆయన ఉన్నత చదువుల కోసం కేం బ్రిడ్జి వెళ్లారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు పాఠాలను బోధించారు. ఆ తర్వాత 1960లో ఇంగ్లాండ్ వెళ్లారు.. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్లి డీ ఫిల్ పూర్తి చేశారు. “ఇండియాస్ ఎక్స్ పోర్ట్ పెర్ఫార్మెన్స్, 1951 -1960, ఎక్స్ పోర్ట్ ప్రాస్పెక్ట్స్ అండ్ పాలసీ ఇంప్లికేషన్స్” అనే అంశంపై సంవత్సరాలకు సంవత్సరాలు పరిశోధన చేసి డాక్టొరల్ థీసిస్ రాశారు. దాని ఆధారంగానే ఇండియాస్ ఎక్స్ పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ సెల్ఫ్ సస్టెయిన్డ్ గ్రోత్” అనే పుస్తకాన్ని రచించారు. డీ ఫిల్ పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో రీడర్ గా పని మొదలుపెట్టారు. అదే విశ్వవిద్యాలయంలో 1963 నుంచి 1965 దాకా ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా పని చేశారు. 1966 నుంచి 69 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ అండ్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థకు పని చేశారు. అప్పట్లో ఆయన ప్రతిభను గుర్తించిన కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు లలిత్ నారాయణ్ మిశ్రా.. విదేశీ వాణిజ్య శాఖలో సలహాదారుడి పోస్ట్ కట్టబెట్టారు. అలా బ్యూరోక్రాట్ గా మన్మోహన్ సింగ్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 1969 నుంచి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అధ్యాపకుడిగా పని చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
ప్రధానమంత్రిగా ఇలా
మనోహన్ సింగ్ రాజకీయ ప్రవేశం యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ.. ఆయన ప్రధానమంత్రి కావడం మాత్రం ఒక సంచలనం అని చెప్పవచ్చు. 2004 మే 22న ప్రైమ్ మినిస్టర్ గా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. 2014 వరకు ఆ పదవిలోనే ఉన్నారు. సంస్కరణల విషయంలో ముందుకే సాగారు. అందువల్ల మన దేశ ఆర్థిక అభివృద్ధి రేటు పెరిగింది. 2007లో ఏకంగా 9 శాతం మైలురాయిని అందుకుంది. మన్మోహన్ హయాంలోనే ఉపాధి, సమాచార హక్కు చట్టాలు వచ్చాయి. అవి దేశంలోనే సరికొత్త చరిత్రను సృష్టించాయి. ఇక వాజ్ పేయి హయాంలో ప్రారంభమైన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొనసాగించింది. 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చింది. నాటి గుమ్మడి ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాలలో ఎనిమిది ఐఐటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.. ఇలా 10 సంవత్సరాలపాటు తన పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న మన్మోహన్ సింగ్ 2014 మే 17న ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాదాపు 33 సంవత్సరాలు పాటు రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొన సాగారు. ఈ ఏడాది ఏప్రిల్ 3 వ తేదీతో మన్మోహన్ సింగ్ రాజ్యసభ ప్రస్థానం కూడా ముగిసింది. సిక్కు సామాజిక వర్గంలో తొలి ప్రధానమంత్రిగా.. నెహ్రూ అనంతరం ఐదు సంవత్సరాల పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయకుడిగా.. నెహ్రూ, ఇందిరా, నరేంద్ర మోడీ తర్వాత ఎక్కువకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ అనేక ఘనతలను సొంతం చేసుకున్నారు.