
వివాదాస్పద ప్రకటనలు చేయడంలో ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు బీజేపీ, మజ్లిస్ నేతలు. కొన్నాళ్ల క్రితం.. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ .. ఓ సమావేశంలో తమకు గంట పాటు స్వేచ్ఛ ఇస్తే.. దేశాన్ని ఇస్లామీకరణ చేస్తామన్నట్లుగా ప్రకటన చేశారు. అంటే.. ఆయన ఉద్దేశం హిందువులందర్నీ ఏదో చేస్తామని. ఆ మాటలు అన్నందుకు ఆయనపై కేసులు నమోదయ్యాయి. దుమారం రేగింది.ఇప్పటికీ ఆమాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా .. ఇలాంటి ప్రకటనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేశారు. కాకపోతే సంజయ్ కాస్త సంయమనం పాటించారు.
‘మేం మేయర్ సీటు గెలిస్తే పాత బస్తీని పోలీసులకు అప్పగించాలనుకున్నం. 15 నిమిషాలు టైమిస్తే నరికి చంపుతామని బెదిరించిన పార్టీ మాది కాదు. 15 నిమిషాలు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ. అధికారం ఇచ్చి పాత బస్తీని ప్రశాంత సిటీగా మార్చడమే బీజేపీ లక్ష్యం’ ఇవీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిన్న చేసిన వ్యాఖ్యలు. ‘కేసీఆర్.. నీకు దమ్మున్నా.. నీలో ఏమాత్రం తెలంగాణ పౌరుషమున్నా పాత బస్తీని 15 నిజాయతీ, నిఖార్సయిన తెలంగాణ పోలీసులకు అప్పగించు. రోహింగ్యాలను, సంఘ విద్రోహ శక్తులను జల్లెడ పడుతరు’ అని మండిపడ్డారు. పాత బస్తీ హైటెక్ సిటీగా మారాలన్నా.. అక్కడి నిరుద్యోగ యువతకు పాస్ పోర్టు, ఉద్యోగాలు రావాలన్నా ఓల్డ్ సిటీలో పాతుకుపోయిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ రోహింగ్యాలను, సంఘ విద్రోహ శక్తులను భయపెట్టాలన్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో దీన్ని దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు.. దానికి కొనసాగింపు ప్రకటనలు చేస్తున్నారు. ఎంఐఎంను ప్రధానంగా టార్గెట్ చేయడం ద్వారా బీజేపీ రాజకీయలాభాలను పొందుతోంది. దాని కోసం వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తోంది. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారని ప్రభుత్వ రికార్డులు కూడా చెబుతున్నాయి. ఇది బీజేపీకి మరింత బలాన్నిస్తోంది. ఈ దూకుడును మరింతగా కొనసాగించాలని అనుకుంటోంది.
అంతేకాదు.. సంజయ్ పోలీసులపై మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి రాష్ట్ర పోలీసులు హీరోలని.. సీఎం తన స్వార్థ రాజకీయాల కోసం వారిని జీరోలుగా మారుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగే కొంత మంది రిటైర్డ్ పోలీసు అధికారులను తిరిగి పోస్టింగులు ఇస్తూ వాళ్ల ద్వారా కోట్లు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇది రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులను అవమానించడమేనన్నారు. కొంతరు పోలీసు అధికారులు టీఆర్‌ఎస్ నేతల్లా మాట్లాడుతున్నారని, ఐపీఎస్ వ్యవస్థను సీఎం అవమానిస్తుంటే పోలీసు అధికారుల సంఘం ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.