Janasena vs BJP బిజెపి – జనసేన పొత్తు వికటించాలన్న కొంతమంది నాయకుల కల నెరవేరింది. అంతర్గతంగా ఎందుకు పావులు కలిపిన ఆ నేతలు ఇప్పుడు ఏం చేయబోతున్నారు. బిజెపితో బంధాన్ని తెంపుకున్న జనసేన పార్టీకి వచ్చే ఎన్నికలు కలిసి వస్తాయా..? బిజెపి, జనసేన పోరు ఎవరికి లాభం అదేంటో ఒకసారి చూసేద్దాం.
రాష్ట్రంలో మిత్రపక్షాలుగా మూడేళ్ల నుంచి కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య ఉన్న పొత్తు బంధం వీగిపోబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ తమకు మద్దతు ఇవ్వలేదన్న వైఖరితో కాస్త గట్టిగానే బిజెపి నేతలు మాట్లాడుతున్నారు. అయితే, ఇది ఊహించని పరిణామమేమీ కాదన్న భావన జనసేన పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతుంది. రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్లాలని భావిస్తున్న జనసేన పార్టీ భావనకు విరుద్ధంగా.. బిజెపి వ్యవహరిస్తున్న తరుణంలో తాము ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితిని బిజెపి ఏ కల్పించింది అన్న భావన జనసేన నాయకుల్లో వ్యక్తం అవుతుంది. జనసేన – బిజెపి పొత్తు విచ్చన్నం కావడానికి ప్రస్తుతం కనిపిస్తున్న కారణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. అయితే, కనిపించని అనేక అంశాలు ఈ పొత్తు పెటాకులు కావడానికి దోహదం చేస్తున్నాయన్నది రాజకీయ నిపుణుల విశ్లేషణ.
బిజెపిలోని కీలక నేతలు కనుసన్నల్లో..
రాష్ట్రంలో బిజెపి సొంతగా ఎదగాలన్నది ఒక వర్గంలోని నాయకుల ఉవాచ. అయితే, సొంతంగా ఎదిగే సామర్థ్యం లేనప్పుడు మిత్రపక్షాలతో కలిసి వెళ్లడం మేలు అన్నది మరో వర్గం వాదన. ఒంటరిగా కాకుండా జనసేనతో కలిసి వెళ్లడం మంచిదన్నది ఈ రెండు వర్గాల ఉమ్మడి మాట. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన మరో విధంగా ఉంది. తెలుగుదేశం పార్టీని కలుపుకొని వెళితే అధికార పార్టీని సులభంగా ఓడించవచ్చు అన్నది ఆయన ఉద్దేశం. అయితే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడాన్ని బిజెపిలోని ఒక వర్గం నాయకులు అంగీకరించడం లేదు. ఇందులో బిజెపి రాష్ట్ర నాయకత్వంలోని కీలక నేతలు ఉండడంతో అగ్ర నాయకత్వం కూడా వారికి అండదండలను అందిస్తోంది. ముఖ్యంగా ఒక రాజ్యసభ సభ్యుడు, రాష్ట్ర బిజెపి ముఖ్యుడు ఇందులో ఉన్నారు. వీళ్లు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్లే రాష్ట్రంలో బిజెపి ఎదగడం లేదన్నది వీరి భావన. 2024 ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఉండలేకపోయినప్పటికీ, 2029 ఎన్నికల నాటికి మాత్రం బలమైన పార్టీగా రాష్ట్రంలో ఆవిర్భవించేందుకు అవకాశం ఉందన్నది వేరే వాదన. అలా ఆవిర్భవించాలంటే మూడో ప్రత్యామ్నాయంగా ప్రజలకు కనిపించాలన్నది వీరి వాదన. అందుకోసమే టిడిపికి దూరంగా ఉండాలన్నది వీరి నిశ్చితాభిప్రాయం.
విసిగిపోవడంతో తాజా నిర్ణయం..
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ.. బిజెపి నేతలు మాత్రం తమతోనే జనసేన పొత్తు ఉంటుందని చెబుతూ వచ్చారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత జనసేన పార్టీ వ్యవహార శైలిపై బిజెపి గుర్రుగా కనిపిస్తుంది. టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేయాలని భావిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ అందుకోసం ఇప్పటివరకు నిరీక్షిస్తూ వచ్చారు. జనసేన తమతోనే ఉంటుందని ఆకాంక్షించిన బిజెపి నేతలు అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకు వేచి చూశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలిపు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. బిజెపికి ఓటు వేయమని చెప్పకపోవడం పట్ల బీజేపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. బిజెపితో జనసేన కలిసి వస్తుందన్న ఆశలు వదులుకున్న ఆ పార్టీ నాయకులు.. తాజాగా జనసేన పార్టీ వ్యవహార శైలిపై విమర్శలను గుర్తించారు. పేరుకే ఇప్పటివరకు జనసేన పార్టీ తమతో పొత్తులో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రూట్ మ్యాప్ కోసం నిరీక్షిస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ ఆలోచనను విరమించుకుని టిడిపి తో వెళ్లడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో ఇరు పార్టీల నాయకులు, మరీ ముఖ్యంగా బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ పట్ల విసిగిపోయి తాజా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.
బిజెపికి దూరంగా ఉండాలని పవన్ భావన..
రాష్ట్రంలో వైసీపీని ఓడించాలని జనసేన, టిడిపి ఇతర పక్షాలు భావిస్తుంటే.. బిజెపి అగ్రనాయకత్వం మాత్రం రాష్ట్రంలోని అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుండడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనంగా ఉన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న కేంద్రం పట్టనట్టు వ్యవహరించడంతోపాటు.. మరింతగా సహకారాన్ని అందించడం పట్ల పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపితో కలిసి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నారని, అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారే తప్ప, బిజెపికి వేయాలని చెప్పలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బిజెపితో కలిసి వెళ్ళకూడదు అన్న నిర్ణయంలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల పిలుపు అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
జనసేనకు కలిసి వచ్చేనా..
రాష్ట్రంలో బిజెపితో కలిసి వెళ్ళకపోవాలన్న జనసేన పార్టీ నిర్ణయం ఎటువంటి ఫలితాలను ఇస్తుందన్న చర్చ సర్వత్రా సాగుతోంది. అయితే, రాష్ట్రంలో బిజెపితో పోలిస్తే జనసేన బలమైన పార్టీ. బిజెపితో కలిసి వెళ్లడం వలన సీట్లు సాధించే పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు లేదు. బిజెపి, జనసేన కలిసి పోటీ చేసిన గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్ లో కలగలేదు. బిజెపితో వెళ్లి బొక్క బోర్లా పడటం కంటే, తమకంటే బలమైన పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్లడం ద్వారా మెరుగైన సీట్లు సాధించేందుకు అవకాశం ఉందని, అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ కు అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకు అనుగుణంగానే బిజెపిని దూరం పెట్టి టీడీపీతో కలిసి ఎందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ బిజెపికి దూరంగా ఉండాలన్న నిర్ణయం జనసేనకు లాబిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మాధవ్ కు విష్ణు కుమార్ రాజు మద్దతు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి జనసేన పార్టీ మద్దతు ఇవ్వకపోవడం వలన ఓటమిపాలయ్యామని చెప్పిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యలను అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సమర్ధించారు. రాష్ట్రంలో వైసీపీతో కలిసి వెళుతున్నామన్న భావన ప్రజల్లో ఉండడం వల్లనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బిజెపికి పడలేదని, ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని విష్ణుకుమార్ రాజు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. ఏ విషయాన్ని మాధవ్ తాజాగా మాట్లాడటంతో ఆయన వ్యాఖ్యలను విష్ణుకుమార్ రాజు సమర్ధించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ విధానాలపై గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న భావనను విష్ణుకుమార్ రాజు తో పాటు పార్టీలోని అనేకమంది ముఖ్య నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Their hand behind the breakup of janasena vs bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com