Theft in Nellore Court : కోర్టులో దొంగలు పడ్డారు.. ఆ మంత్రి కేసు పత్రాలు ఎత్తుకెళ్లారు? వెనుకుంది ఎవరు?

Theft in Nellore Court : ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులుగా అధికార పార్టీ నేతల చర్యలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా నెల్లూరులోనూ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన కోర్టు సిబ్బంది జిల్లా న్యాయమూర్తికి సమాచారం ఇవ్వటం.. పోలీసులకు […]

Written By: NARESH, Updated On : April 15, 2022 12:24 pm
Follow us on

Theft in Nellore Court : ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులుగా అధికార పార్టీ నేతల చర్యలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. తాజాగా నెల్లూరులోనూ మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య వైరం పతాకస్థాయికి చేరింది. జిల్లా కేంద్రంలోని ఓ కోర్టులో దొంగలు పడ్డారు. కీలక కేసుకు సంబంధించిన పత్రాలు అపహరించారు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకువెళ్లారు. గురువారం ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన కోర్టు సిబ్బంది జిల్లా న్యాయమూర్తికి సమాచారం ఇవ్వటం.. పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు మొదలైంది.

-కోర్టులో ఆ కేసుకు సంబంధించినవే!
నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో కొందరు వ్యక్తులు చొరబడ్డారు. ఓ బ్యాగును ఎత్తుకెళ్లి.. కోర్టు బయట ఉన్న కాలువలో పడేశారు. పోలీసులు దానిని పరిశీలించగా.. అందులో పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, చోరీకి గురైన వాటిలో కొన్ని పత్రాలను..కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. ల్యాప్‌టాప్, 4 మొబైల్‌ ఫోన్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా భావిస్తున్నారు!

-కాకాని వర్సస్‌ సోమిరెడ్డి
మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి 2017 డిసెంబరులో ఆరోపించారు. ఆ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లని కొన్ని పత్రాలను మీడియాకు విడుదల చేశారు. అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్‌ స్టేషన్ లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించిన పోలీసులు చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ–1 నిందితుడిగా పేర్కొన్నారు.

-నకిలీ పత్రాలంటూ ఆరోపణ.. పోలీసుల విచారణ
నకిలీ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్‌ మణిమోహన్ ను ఏ–2గా, మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ 4వ అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతోంది. ఈ కేసులో ఏ2గా ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్‌ మణిమోహన్ (పాస్‌పోర్టు ప్రకారం) ఆ కేసులో నకిలీ పత్రాలు రూపొందించినట్లు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు తెలుస్తోంది. కోర్టు విషయంతో పాటు.. కీలక కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు లోతుగా ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ చేస్తున్నారు.

-మంత్రుల మార్కు రాజకీయం..
2017లో అప్పుడు మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై నాడు సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని నకిలీ పత్రాలు మీడియాకు చూపించారు. నాడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు సోమిరెడ్డి ఫిర్యాదు మేరకు కాకాణి గోవర్ధరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరిపి కాకాణి చూపిన పత్రాలు నకిలీవే అని ధ్రువీకరించారు. దీంతో సోమిరెడ్డి ఈ విషయంలో కాకాణిపై పరువునష్టం దావా వేశారు. తాజాగా కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో ఇప్పుడు ఆయన తన మార్కు రాజకీయానికి తెరలేపారు. మంత్రి అండ ఉంటుందన్న ధీమాతోనే ఆయన అనుచరులు కోర్టుకే కన్నం వేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో కాకాణికి శిక్ష పడే అవకాశం ఉన్నందునే ఆయనే వెనుక ఉండి పత్రాలు మాయం చేయించారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, హైకోర్టు ఈ చోరీ ఘటనపై చర్యలు తీసుకోవాలని, పత్రాలు అపహరించిన దొంగలను అరెస్ట్‌ చేయాలని, చోరీ వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.