AP Movie Tickets Issue:ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గించడం.. ఆన్ లైన్ టికెటింగ్ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఈ టికెట్ ధరల వివాదాన్ని ఇప్పట్లో జగన్ సర్కార్ పరిష్కరించేలా లేదు. హైకోర్టు సినిమా టికెట్లపై ఏపీ సర్కార్ జారీ చేసిన జీవోను కొట్టివేసినా దానిపై అప్పీలుకు వెళ్లి మరీ షాకిచ్చాడు జగన్. దీంతో ఇప్పట్లో సినీ ఇండస్ట్రీకి ఊరట దక్కేలా లేదు.
ప్రభుత్వ నిర్ణయం పక్కా రాజకీయ కక్ష సాధింపేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానంపై గతంలో పలువురు సినిమాపెద్దలు స్పందించారు. థియేటర్ యాజమాన్యాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై నేరుగానే మండిపడ్డారు. కొంతమంది ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడానికే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి ఇండస్ట్రీలో కొంతమంది ఓకే చెప్పినా టికెట్ ధరలను తగ్గించడానికి మాత్రం తప్పుపడుతున్నారు.
సినీ ఇండస్ట్రీలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారెవరూ తమకు సహకరించడం లేదని అధికార పార్టీ భావనగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో టీడీపీ, జనసేన అనుకూల సామాజికవర్గాల ఆధిప్యతముందని.. వైసీపీ అనుకూలంగా ఉండేవారి పాత్ర నామమాత్రంగా ఉందని అధికార వర్గాలు అనుకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే సినీ పరిశ్రమను జగన్ టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రభుత్వం మాత్రం సామాన్యులకు వినోదాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెబుతున్నా దాంతో ఎవరూ ఏకీభవించడం లేదు. ఏపీలో రాజకీయ వేడి రగిలిస్తున్న సినిమా టిక్కెట్ల వివాదానికి ప్రభుత్వం చెక్ పెడుతుందా? లేదా సినీ ఇండస్ట్రీనే సర్దుకుపోతుందా? అన్నది వేచిచూడాలి.