CM Jagan: వైసిపి దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే వై నాట్ 175 అని సౌండ్ చేస్తున్న వైసిపి నాయకత్వం.. అందుకు తగ్గట్టే కసరత్తు ప్రారంభించింది. సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు వాటి ప్రచారానికి ప్రాధాన్యమిస్తోంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు ప్రాంతాల్లో బస్సు యాత్రలను ప్రారంభించనుంది. ఎస్సీ, ఎస్టీలతోపాటు అణగారిన వర్గాల వారికి వైసిపి ప్రభుత్వంతో చేకూరిన లబ్దిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసిపి కీలక నాయకులు ప్రజలకు వివరించనున్నారు. మూడు నెలల పాటు ఈ యాత్ర కొనసాగునుంది.
ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం అంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను ప్రతి ఇంటికి పంపించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆ కార్యక్రమం ప్రాతిపదికగానే ఎమ్మెల్యేల పనితీరును మదించారు. దానికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నారు.గడపగడపకు మరో ప్రభుత్వం ద్వారా ప్రజల మనసులో ఏముందో తెలుసుకోగలిగారు. ఈ ఆరు నెలల వ్యవధిలో వాటి పరిష్కారానికి కృషి చేయనున్నారు.
అటు రాజకీయంగా సైతం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఎదురయ్యే పరిణామాలను బేరీజు వేసుకొని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో.. వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రలను చేపట్టాలని నిర్ణయించారు. అదే సమయంలో తాను సైతం జిల్లాల యాత్ర చేపట్టాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలను జిల్లాలకు వచ్చి ప్రారంభిస్తున్నారు. ఈ ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు.
ఇప్పటినుంచి ప్రతిరోజు పాలనతో పాటు పార్టీకి కొంత సమయాన్ని కేటాయించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలను యూనిట్ గా తీసుకొని .. ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని మదించనున్నారు. పార్టీలో వర్గ విభేదాలు నిఘా వర్గాల హెచ్చరికలతో జగన్ జాగ్రత్త పడుతున్నారు. వివాదాస్పద నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ఎక్కడైనా విభేదాలు ఉంటే సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ప్రతి నియోజకవర్గాన్ని జగన్ జల్లెడ పట్టనున్నారు. వై నాట్ 175 అన్న స్లోగన్ ను నిజం చేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.