Pawan Kalyan
Pawan Kalyan Vs YCP Ministers: పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక బాధ్యతాయుతమైన ప్రకటన చేశారు. తెలుగు రాష్ట్రాల మంత్రుల మధ్య సంవాదం జరుగుతున్న నేపథ్యంలో పవన్ స్పందించారు. రాజకీయ నేతలు వేరు.. ప్రజలు వేరని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి ప్రజలను కించపరచవద్దని హితబోధ చేశారు. తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇందులో ఏం తప్పుందో తెలియదు కానీ.. వైసీపీ మంత్రులు పవన్ పై ఎదురుదాడికి దిగారు. ఏపీ మనోభావాలపై తాము మాట్లాడుతుంటే పవన్ తెలంగాణ మంత్రులకు సపోర్టు చేస్తున్నారని విమర్శలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పై అంత ప్రేమ ఎందుకో అంటూ కొత్త అనుమానాలకు తెరతీశారు. పవన్ బీఆర్ఎస్ తో కలిసి నడవబోతున్నారని కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
అందరికీ ఆయనే టార్గెట్..
అయితే పవన్ ను ఒక్క వైసీపీ మంత్రులే కాదు.. ఎల్లో మీడియా సైతం టార్గెట్ చేసింది. మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తనతో కలిసి వస్తే పవన్ కు రూ.1000 కోట్లు ఆఫర్ చేశారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాక్రిష్ణ రాసుకొచ్చారు. ఇది పెద్ద దుమారానికే దారితీసింది. దీనిపై జనసేన రియాక్షన్ చూసి ఆర్కే కంగారుపడిపోయారు. తనదైన మార్కు విశ్లేషణతో వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఇదే విషయమై వైసీపీ మంత్రులు వరుసకట్టి మరీ వచ్చి పవన్ పై విమర్శలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ తో పవన్ కలిసి వెళతారని ప్రచారం చేస్తున్నారు. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య భావోద్వేగంపై స్పందించిన పాపానికి పవన్ మెడకు కొత్త పొత్తులను అంటగడుతున్నారు. ప్రజల్లో అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అది సాధ్యమేనా?
పవన్ ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి నడుస్తామని చెబుతున్నారు. ఇటీవల ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలిసి కీలక ప్రతిపాదనలు ఉంచారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహాలు పంచుకున్నారు. అటు పెద్దలు కూడా సానుకూలంగా స్పందించారు. బీజేపీతో సఖ్యతగా ఉండి.. కలిసి నడవాలనుకుంటున్న పవన్ బీఆర్ఎస్ తో వెళ్లాలనుకోవడం సాధ్యమేనా? ప్రస్తుతం కేసీఆర్ బీజేపీతో గట్టిగా పోరాడుతున్నారు. ఆ పార్టీకి తానే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ తరుణంలో బీజేపీని కాదని.. రాజకీయ శత్రువు, ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్ తో కలవడం సాధ్యమేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది అనవసర ప్రచారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Pawan Kalyan
తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసమే..
కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి అగాధం ఏర్పడకూడదన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఈ అంశంపై స్పందించారు. రాజకీయ పార్టీ నేతలుగా మీరు విమర్శించుకోండి.. ఆరోపణలు చేసుకోండి అని మాత్రమే పవన్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలను కించపరచొద్దు అని మాత్రమే అన్నారు. ఏపీ ప్రజలు వచ్చేయ్యండి అన్న పిలుపుతోనే తెలంగాణలో ఏపీ మంత్రులకు వ్యాపారాలు లేవా? అని ప్రశ్నించారు. ఈ మాటలను పట్టుకొని ఏపీ మంత్రులు రాజకీయాలు మొదలుపెట్టారు. పవన్ ను ఏపీలో తక్కువ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రులు ఏపీలో పరిస్థితుల్ని.. ప్రభత్వ చేతకాని తనాన్ని బయట పెట్టారు కానీ.. ఏపీని.. ప్రజల్ని కించపర్చలేదు. కానీ ఏపీ మంత్రులు .. ముఖ్యంగా సీదిరి అప్పలరాజు మాత్రం తెలంగాణ ప్రజలకు బుర్రలేదని అందర్నీ కలిపి అనేశారు. ఇదే తీవ్ర విమర్శలకు కారణం అయింది. పవన్ కూడా ఇలా తిట్టడం తప్పని చెబితే ఆయనపై దాడి చేస్తున్నారు. కాలం మారుతోంది.. రాజకీయాలు మారుతున్నాయి. కానీ పవన్ విషయంలో వైసీపీ విష జాఢ్యం మాత్రం వీడడం లేదు.