
AP Debts: మింగలేక కక్కలేక అన్నట్టు ఉంది వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. జీతాల చెల్లింపునకు డబ్బుల్లేవు. షెడ్యూల్ ప్రకారం బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులు విడుదల చేయలేదు. తీసుకున్న అప్పులన్నీ ఓవర్ డ్రాఫ్ట్‌లోకి వెళ్తున్నాయి. మరోవైపు సంక్షేమ పథకాలకు నిధులు ఆపడం లేదని డాంబికాలకు పోతుంది. ఈ రోజు మరో 900 కోట్లు అవసరమని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. అవి వస్తేనే ప్రభుత్వ వ్యవహారాలు ఈ నెలలో నడిచే పరిస్థితి నెలకొని ఉంది.
ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందుకునే ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని నెలల నుంచి సరైన సమయానికి బ్యాంకుల్లో జమ కావడం లేదు. 20 తేదీ వరకు జీతాలు పడుతుండటంతో లబోదిబోమంటున్నారు. విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా ఇప్పటి వరకు రిఎంబర్స్‌మెంట్ నిధులను ఒక్క విడత కూడా విడుదల చేయలేదు. మరోవైపు కళాశాలల నుంచి ప్రభుత్వం చెల్లింపులకు అవసరమైన సమయం దాటిపోతుంది. రిఎంబర్స్‌మెంట్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టత లేకపోవడంతో, కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజలు చెల్లించాలని వత్తిడి చేస్తున్నారు.
అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆసరా డబ్బులు మహిళల ఖాతాల్లో జమకాలేదు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కింద నగదు ప్రతి సంవత్సరం జమ చేస్తామని వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఉంది. ఆ మేరకు ప్రతి మహిళ ఖాతాలో నగదు ఇప్పటికీ జమ చేయలేదు. దీని కోసం రూ.ఆరు వేల కోట్లు అవసరమవుతాయి. ప్రస్తుతం వందల కోట్లే లేవు.. ఇంకా వేల కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలో తెలియక ఆర్థిక అధికారులు సతమతమవుతున్నారు. దీంతో ఈ నెల కూడా ఆసరా చెల్లింపుల బటన్ నొక్కే పరిస్థితులు కనబడటం లేదు.
సహజంగా మార్చి నెలలో బిల్లుల చెల్లింపు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. జమ ఖర్చుల వివరాలను లెక్కలేసుకొని పనిలో ట్రెజరీ శాఖ బాగా బిజీగా ఉంటుంది. ఈ నెలలో విడుదల కావాల్సిన నిధుల కోసం బిల్లుల అప్ లోడింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా మతలబులు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిన బిల్లులను పక్కన పెట్టి, ముఖ్య నేతలకు కావాల్సిన వారి బిల్లులను సబ్మిట్ చేస్తున్నారని అంటున్నారు.

ప్రతీసారి ఈ నెల గడిస్తే చాలన్నట్లు ఉంది వైసీపీ ప్రభుత్వ పరిస్థితి. 1వ తేదీ వస్తుంటే కొత్త అప్పులకు కేంద్రం వంకకు చూడటం పరిపాటిగా మారింది. గత నెల తీసుకున్న రూ.2వేల కోట్లు ఖర్చు అయిపోయాయి. మొత్తం అప్పు రూ.10లక్షల కోట్లు దాటిపోయింది. ఇవన్నీ ఓవర్ డ్రాఫ్ట్ లోకి వెళ్లిపోయాయి. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. అప్పొస్తే చాలన్నట్లుగా వ్యవహరిస్తుంది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా, గుంభనంగా ఉంటుంది. ధరలు పెరిగిపోయి సామాన్యలు పరిస్థితి అల్లాడిపోతున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు మాత్రం అర్హులందరికీ అందజేస్తున్నామని కలరింగ్ ఇస్తున్నారు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే రాష్ట్ర పరిస్థితి ఏమిటని ప్రజల్లో ఇప్పటికే భయం పట్టుకుంది. వచ్చే నెల నుంచి ఆర్థిక ఏడాది ముగస్తుండటంతో, మరిన్ని కొత్త అప్పులను చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రణాళికలు వేసుకుంటుండటం శోచనీయం.