World’s largest solar plant: విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. ఇప్పుడు కొత్తగా విద్యుత్ వాహనాలు కూడా అందుబాటులోకి రావడంతో ఫ్యూచర్లో ఎక్కువ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే అవసరాలకు తగిన విద్యుత్ తయారు చేయడానికి సరైన వనరులు అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వం సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే సబ్సిడీ కింద సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అయితే ప్రభుత్వం కూడా కొన్ని ప్రదేశాల్లో ప్రత్యేకమైన సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇందులో బాగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంటును రాజస్థాన్ రాష్ట్రంలోని బడ్లా అనే గ్రామంలో నెలకొల్పింది. దీని విశేషాల్లోకి వెళితే..
బడ్లా గ్రామంలో ఉష్ణోగ్రత విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సగటున 46 నుంచి 48 డిగ్రీలు నమోదు అవుతుంది. ఇక్కడ ప్రాణులు జీవించడానికి ఏమాత్రం అవకాశం లేదు. కానీ సోలార్ ప్లాంట్ నెలకొల్పడానికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. అందుకే 10 వేల కోట్ల ఖర్చుతో 14 వేల ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కోటి సోలార్ ప్లేట్లు ఉంటాయి. ఈ సోలార్ ప్లాంట్ సన్ రైస్ నుంచి 2245 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది. ఇది థార్ ఎడారిలో ఉండడంతో వేడి గాలులు.. ఇసుక తుఫాను ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా సోలార్ ప్లాంట్లపై నిత్యం ఇసుక పడుతూ ఉంటుంది. అయితే రోబోట్ సహాయంతో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు. ఇది సంవత్సరానికి నాలుగు మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.ఈ ఒక్క సోలార్ ప్లాంట్ తో 13 లక్షల ఇళ్లకు విద్యుత్ ను అందించనున్నారు.
ఈ సోలార్ ప్రాజెక్టులో 25,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు పొందారు. భవిష్యత్తులో విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటుచేసిన ఈ సోలార్ ప్లాంట్ తో ఎన్నో రకాల గ్రామాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. అలాగే సోలార్ ప్లాంట్లను ఇతర ప్రదేశాల్లో కూడా అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ప్రకటిస్తోంది. అంతేకాకుండా సోలార్ ఇంటిపై అమర్చుకొని విద్యుత్ ఉత్పత్తిని చేస్తే అందుకు తగిన ఆదాయాన్ని కూడా ఇవ్వనుంది. భవిష్యత్తులో సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి జరిగితే తక్కువ ధరకే విద్యుత్ను పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎన్నో రకాల కర్బన ఉద్గారాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అయితే సోలార్ పై ఇప్పుడిప్పుడే చాలామందికి అవగాహన వస్తుంది. ఇప్పటికే కొంతమంది వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు పెద్దపెద్ద భవనాలపై వీటిని నిర్మించుకుంటున్నారు.