Telangana: ప్రస్తుతం తెలంగాణలో రాజకీయమంతా వరి రైతుల చుట్టే తిరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యాసంగిలో పండించే వడ్లను కొనబోమని స్పష్టం చేసింది. దీనికి అనుగూణంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచనలు చేస్తోంది. యాసంగిలో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని చెబుతోంది. అయితే సమస్య ఇక్కడే వస్తోంది. వరి అంశాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ స్వార్థ రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. దీంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు.
వరి విషయంలో చెరో మాట..
హుజూరాబాద్ ఎన్నికల ముందు నుంచే వరి చుట్టు రాజకీయం తిరగడం ప్రారంభమైంది. వడ్లను కొనబోమని, వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మరలాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఇదే అంశం అప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా మారింది. ఈ విషయంలో సిద్ధిపేట కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్ భిన్న ప్రకటనలు చేశారు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. హుజూరాబాద్ ఎన్నికలు ముగిసిన తరువాత ఈ విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
నాలుగు రోజులు కిందట సీఎం కేసీఆర్ ముందుకు వచ్చి ఈ అంశంపై మాట్లాడారు. వరి ఎందుకు వేయద్దంటున్నారో వివరించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద గత యాసంగికి సంబంధించిన ధాన్యం నిల్వలే చాలా ఉన్నాయని చెప్పారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేయబోమని చెబుతోందని తెలిపారు. కానీ కానీ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రైతులు యాసంగిలో వరి సాగుచేయాలని, తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. కానీ రైతుకు ఏ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు.
సెప్టెంబర్‌లోనే జరిగిన ఒప్పదం..
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సెప్టెంబర్ నెలలోనే ఒప్పందం జరిగింది. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడింది. కానీ ఈ విషయాన్ని దాచిపెట్టింది. బాయిల్డ్ రైస్‌ను కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిన అంశానికి రాష్ట్రం లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పారు. కానీ ఈ విషయం హుజూరాబాద్ ఎన్నికలు అయ్యేంత వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయంపై ప్రస్తుతం టీఆర్ఎస్‌కు, బీజేపీకి క్లారిటీ ఉంది. కానీ ఇప్పటికీ ఇదే అంశంపై రెండు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. యాసంగి వడ్లను కొనాలని డిమాండ్ చేస్తూ 11వ తేదీన టీఆర్ఎస్, రైతులను కలుపుకొని ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికీ వరి వేయాలా ? వద్దా ? అనే అంశంపై రైతులకు ఎవరూ స్ఫష్టత ఇవ్వలేదు. దీంతో అన్నదాత ఆందోళనలో ఉన్నాడు. ఇటు నాటు వేసే సమయం దాటిపోతుండటంతో పరేశాన్ అవుతున్నాడు. ఈ విషయంపై రైతులకు ఒక స్ఫష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.
Also Read: కేసీఆర్ పై మరో బాంబు పేల్చిన రేవంత్ రెడ్డి
కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురేనట.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు