Times Of India Newspaper Apology: ఒకసారి తప్పు జరిగితే దానిని పొరపాటు అంటారు.. అవే వరుసగా జరిగితే అలవాటు అంటారు. అయితే పొరపాటు మానవ సహజం.. మళ్లీ మళ్లీ జరుగగకుండా చూసుకోవడం కూడా బాధ్యత. కానీ, దేశంలోని ప్రముఖ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా పదే పదే పొరపాటు చేస్తూ అభాసుపాలవుతోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా తప్పుడు లేదా సంచలనాత్మక నివేదికలు ప్రచురించడం, ఆ తర్వాత చిన్న లేదా తక్కువ ప్రాముఖ్యత కలిగిన క్షమాపణలు జారీ చేయడం ఒక నమూనాగా గుర్తించబడింది. ఈ లోపాలు, క్షమాపణలు టైమ్స్ ఆఫ్ ఇండయా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. కొన్ని సందర్భాలలో, టైమ్స్ ఆఫ్ ఇండియా తమ లోపాలు విదేశీ న్యూస్ ఏజెన్సీల నుంచి తీసుకున్న సమాచారం వల్ల జరిగాయని పేర్కొంది. పొరపాట్లు నివారించడానికి తగిన ఫాక్ట్–చెకింగ్ విధానాలు లేకపోవడం విమర్శలకు దారితీసింది.
గుజరాత్ హైకోర్టు ఆదేశాలు (2024)
సందర్భం: గుజరాత్ హైకోర్టు, ఆగస్టు 13, 2024న, టైమ్స్ ఆఫ్ ఇండయా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లను, మైనారిటీ విద్యా సంస్థల హక్కులకు సంబంధించిన కోర్టు విచారణలను తప్పుగా నివేదించినందుకు గమనించింది. ఈ నివేదికలు కోర్టు అభిప్రాయాన్ని తప్పుగా చిత్రీకరించాయని, ఇది సంచలనాత్మక రిపోర్టింగ్‌గా భావించబడింది. కోర్టు, ఈ నివేదికలను ‘తప్పుడు, వక్రీకరించిన వివరణ‘గా పేర్కొంది.
క్షమాపణ..
తొలి క్షమాపణ (ఆగస్టు 23, 2024): ఆగస్టు 22, 2024న కోర్టు ఆదేశాల మేరకు, తన అహ్మదాబాద్ ఎడిషన్‌లో మొదటి పేజీలో టైమ్స్ ఆఫ్ ఇండియా క్షమాపణ ప్రచురించింది. కానీ, ఈ క్షమాపణ చిన్న అక్షరాల్లో మరియు సరైన ప్రాముఖ్యత లేకుండా ఉందని కోర్టు భావించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా క్షమాపణలో ఇలా పేర్కొంది. ‘మేము హైకోర్టును అత్యంత గౌరవంగా భావిస్తాము వేదికలో జరిగిన లోపం కోసం కోర్టుకు, మా పాఠకులకు హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము.‘
రీ–పబ్లికేషన్ ఆదేశం..
గుజరాత్ హైకోర్టు, చీఫ్ జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ ప్రణవ్ త్రివేదీల బెంచ్, సెప్టెంబరు 5, 2024లోపు బోల్డ్ అక్షరాల్లో స్పష్టమైన పబ్లిక్ అపాలజీని మళ్లీ ప్రచురించాలని ఆదేశించింది. క్షమాపణలో ఆగస్టు 13, 2024న ప్రచురితమైన తప్పుడు నివేదికకు సంబంధించిన వివరాలు స్పష్టంగా ఉండాలని కోర్టు నిర్దేశించింది.
సుప్రీం కోర్టు స్టే: సెప్టెంబరు 4, 2024న, సుప్రీం కోర్టు ఈ ఆదేశాన్ని స్టే చేసింది, దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా మళ్లీ క్షమాపణ ప్రచురించాల్సిన అవసరం తప్పింది.
కాశ్మీర్ సమస్య (2025)
తాజాగా ఏప్రిల్ 25, 2025న ఉత్తరప్రదేశ్ ఎడిషన్‌లలో జమ్మూ – కాశ్మీర్‌ను ‘ఇండియన్ ఆక్యుపైడ్ కాశ్మీర్‘ అని పేర్కొన్న ఒక తప్పుడు క్యాప్షన్‌ను ప్రచురించింది. ఈ క్యాప్షన్ విదేశీ న్యూస్ ఏజెన్సీ నుంచి తీసుకోబడింది. ఈ పదజాలం భారతీయ జాతీయవాదులకు అభ్యంతరకరంగా భావించబడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ లోపాన్ని గుర్తించి, తప్పు క్యాప్షన్‌ను తొలగించింది. దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది: ‘మేము జమ్మూ – కాశ్మీర్‌కు సంబంధించి మా ఉత్తరప్రదేశ్ ఎడిషన్‌లలో కొన్ని ప్రారంభ ఎడిషన్‌లలో ప్రచురితమైన తప్పు క్యాప్షన్ కోసం హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము. ఈ లోపం విదేశీ న్యూస్ ఏజెన్సీ నుంచి∙తీసుకోబడిన క్యాప్షన్ వల్ల సంభవించింది.‘
ఫేక్ న్యూస్ ఆరోపణలు..
తాజాగా సోఫియా కురేషీ మరియు వ్యోమికా సింగ్(2025) గురించి జూన్ 2, 2025న ఒక వార్త ప్రచురించింది. దీనిలో భారతీయ జనతా పార్టీ (BJP) కల్నల్ సోఫియా కురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లను తమ ప్రచార ముఖంగా ఉపయోగించనుందని తప్పుగా పేర్కొంది. ఈ వార్త BJP ద్వారా తప్పుగా గుర్తించబడిన తర్వాత, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఎక్స్‌లో ఒక క్షమాపణ జారీ చేసింది, దీనిలో తమ నివేదిక తప్పు అని అంగీకరించింది. అయితే, ఈ క్షమాపణ చిన్నగా ఉందని మరియు తగినంత దృష్టిని ఆకర్షించలేదని ఎక్స్ పోస్ట్‌లలో విమర్శలు వచ్చాయి.
సౌదీ అరేబియా వీసా వార్త (2025)
జూన్ 9, 2025న, టైమ్స్ ఆఫ్ ఇండియా తన వెబ్‌సైట్‌లో సౌదీ అరేబియా భారత్‌తో సహా కొన్ని దేశాలకు బ్లాక్ వర్క్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందని ఒక తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ వార్త తప్పని తేలిన తర్వాత, ఎక్స్‌లో విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈ వార్తను తొలగించి, క్షమాపణ వ్యక్తం చేసింది: ‘మేము సౌదీ అరేబియా కొన్ని దేశాలకు బ్లాక్ వర్క్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసిందని పేర్కొన్న వార్తను ప్రచురించాము. ఇది తప్పు, ఆ వార్తను తొలగించాము. ఈ లోపం వల్ల కలిగిన గందరగోళానికి మేము హదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాము’ అని పేర్కొంది.