Sudarshan Chakra Mission: కాలుష్యం విషయాన్ని పక్కన పెడితే.. ఢిల్లీ అనేది అద్భుతమైన నగరం. ఈ నగరానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. సాంస్కృతిక వైవిధ్యానికి.. ఆధునిక విలాసానికి ఢిల్లీ నగరం పెట్టింది పేరు. ఢిల్లీ నగరం మన దేశానికి రాజధానిగా ఉంది. వాస్తవానికి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన రాజధానులలో ఢిల్లీ నగరం ముందు వరుసలో ఉంటుంది.
ఢిల్లీ నగరంలో ఇటీవల ఉగ్రవాదులు కారు బాంబు పేలుడుకు పాల్పడ్డారు. అంతకుముందు అనేక సందర్భాలలో ఉగ్రవాదులు ఢిల్లీ నగరంలో దాడులకు పాల్పడ్డారు. అయితే ఇటీవల కారు బాబు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం అంత సులువుగా తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఢిల్లీ విషయంలో మరింత జాగ్రత్త అవసరమని భావించింది. ఇందులో భాగంగానే ఢిల్లీ నగరంలో కీలకమైన విఐపి 89 జోన్ లో గగనతల భద్రత కోసం కేంద్రం ఒక కీలక అడుగు వేసింది. దేశీయంగా సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ (IADWS) కొనుగోలు చేయడానికి పచ్చ జెండా ఊపింది.
IADWS ను సుదర్శన చక్ర లో భాగంగా ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. పైలెట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. అయితే దీని విలువ దాదాపు 5,131 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీనిని డిఆర్డిఓ డెవలప్ చేసింది. ఢిల్లీ నగరం చుట్టూ ముప్పై కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి గగనతల ముప్పునైనా సరే ఇది అడ్డుకుంటుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. సున్నితమైన ప్రాంతాలలో డ్రోన్ల వంటి వాటితో ముప్పు పెరుగుతోంది. అందువల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటే పారా మిలిటరీ కి రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి 79 వేల కోట్ల రూపాయలతో ఆయుధాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎయిర్ డిఫరెన్స్ సిస్టం ను కొనుగోలుకు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం…
సుదర్శన చక్రంలో భాగంగా కీలకమైన ప్రాంతాలను రక్షించడానికి బహుళ విధానాలలో కవచాన్ని.. కౌంటర్ ఎటాక్ సిస్టం ను డెవలప్ చేస్తారు. ఇదే విషయాన్ని ఏడాది స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి చెప్పారు. మనదేశంలోని వ్యూహాత్మక, పౌర, సాంస్కృతిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను రక్షించడం ఈ సిస్టం ఫస్ట్ ప్రయారిటీ. ఈ క్రమంలోనే శత్రు దేశాలకు సంబంధించిన మిసైల్స్, ఇతర యుద్ధ విమానాలను గుర్తించి.. వాటిని నేల కూల్చుతారు. ఇటువంటి వ్యవస్థలను అభివృద్ధి చేస్తారు. సైబర్ యుద్ధాలను కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యాన్ని ఈ వ్యవస్థకు అనుసంధానిస్తారు. డిఆర్డిఓ, ఇంకా కొన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.