Kolkata Temperature: బంగ్లాదేశ్ తో సరిహద్దు.. హౌరా బ్రిడ్జి, సాల్ట్ లేక్ స్టేడియం, హిల్ స్టేషన్లు, సుందర్ బన్ అడవులు.. ఇలా చెప్పుకుంటూ పోతే పశ్చిమ బెంగాల్లో.. ఆ రాష్ట్ర రాజధాని కోల్ కతా లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇక బెంగాలీ రసగుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు కోల్ కతా ఒక్కసారిగా వార్తలలో నిలిచింది.
కోల్ కతా గురించి దేశవ్యాప్తంగా చర్చ ఎందుకు మొదలైంది అంటే.. దాదాపు 13 సంవత్సరాల తర్వాత బెంగాల్ రాజధానిలో అత్యంత దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. వాస్తవానికి చలి తీవ్రత ఉదయం, రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. కానీ బెంగాల్ రాజధానిలో సోమవారం మధ్యాహ్నం కూడా రాత్రి మాదిరిగానే ఉంది. మంగళవారం కూడా అదే పరిస్థితి. బుధవారం ఉదయం పూట ఆ ప్రాంతంలో అదే స్థాయిలో వాతావరణం ఉంది. ఎముకలు కొరికే చలిలో కోల్ కతా నగరవాసులు నరకం చూశారు. పగటిపూట ఉష్ణోగ్రత గరిష్టంగా 18.2 డిగ్రీల సెల్సియస్ నమోదయిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2012 డిసెంబర్ 28 తర్వాత ఆలీపూర్ ప్రాంతంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరోజు గరిష్ట ఉష్ణోగ్రత 16.3 డిగ్రీల సెల్సియస్ నమోదయింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతంలో ఈ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. వాస్తవానికి చలికాలంలో ఉదయం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ నమోదు అవుతుంటాయి. కానీ చలికాలంలో ఈ ప్రాంతంలో పగటిపూట ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్ల శీతల వాతావరణం ఏర్పడింది. వాతావరణ శాఖ మంగళ, బుధవారాల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పినప్పటికీ ఆ పరిస్థితులు కనిపించడం లేదని కోల్ కతా నగర వాసులు చెబుతున్నారు.
గతంలో ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పొగ మంచు దట్టంగా ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. లైట్లు వేసుకొని, అత్యంత జాగ్రత్తగా వాహనాలు నడపాల్సి వస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.. చలి విపరీతంగా ఉండడంతో చాలా వరకు వ్యాపారాలు తగ్గిపోయాయని బెంగాల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.