
Balineni Srinivas Reddy : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సినీ రంగంలో పెట్టుబడులు వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రముఖ చలనచిత్ర సంస్థలో ఆయనకు పెట్టుబడులు ఉన్నట్లు విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇటీవల ఆరోపించారు. ఈ ఆరోపణలతో ఆగకుండా ఐటీ శాఖ అధికారులకు కూడా ఆయన ఫిర్యాదు చేసి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒంగోలు జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. ఆయనకు సంబంధించిన పెట్టుబడులు వ్యవహారం ప్రస్తుతం రాజకీయంగా అనేక విమర్శలకు కారణమవుతోంది. సినిమా రంగంలోని ఓ ప్రముఖ సంస్థలో ఆయన పెట్టుబడులు పెట్టారు అంటూ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా స్పందించారు.
ఆరోపణలు పూర్తిగా అవాస్తవం..
సినీ నిర్మాణ సంస్థలో తనకు పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ తరహా ఆరోపణలు సరికాదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డికి ఆ సంస్థలో రూపాయి కూడా పెట్టుబడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ ఆరోపణలను రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని బాలినేని సవాల్ చేశారు. తనకు పెట్టుబడిలు ఉన్నాయో లేదో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసుకోవచ్చని ఈ సందర్భంగా బాలినేని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ ఆరోపణలు చేస్తున్న మూర్తి యాదవ్..
జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ అక్రమ లావాదేవీలు విషయంలో బాలినేని బినామీ, ఆయన వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి, వైసిపి నేత, ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావులపై విచారణ జరిపించాలని విశాఖలోని ఆదాయ పన్నుల శాఖ నిఘా అమలు విభాగం కమిషనర్ కు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశాఖ పోర్టు స్టేడియం వెనుక ఎస్బిఐ పక్కనే ఉన్న కార్యాలయంలోనూ దాడులు కొనసాగుతున్నాయని, ఈ చలనచిత్ర నిర్మాణ సంస్థ అక్రమాస్తులు, లావాదేవీలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం దాడులు నిర్వహిస్తోందని వెల్లడించారు. అక్రమాస్తుల లావాదేవీలు వెనుక తెలంగాణకు చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఆంధ్రకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.
బాలినేని బినామీగా ఆయన వియ్యంకుడు..
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బినామీగా పేరొందిన ఆయన వియ్యంకుడు, విశాఖకు చెందిన కుండా భాస్కర్ రెడ్డి ఈ వ్యవహారాలు నడిపినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. వైసీపీ నాయకుడు, ఆడిటర్ జీవీ ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసిందని వెల్లడించారు. వీరి ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలు, నగదు పంపకాలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేసిన తాజా ఆరోపణలు విశాఖ జిల్లాలో సంచలనం రేపుతున్నాయి. విశాఖ మీద ప్రేమతో రాజధానిగా ప్రకటించలేదని, ఈ తరహా వ్యవహారాలకు కేంద్రంగా విశాఖను చేసుకునే ప్రయత్నాలు వైసిపి నాయకులు చేస్తున్నారనే విమర్శలు దీంతో ఎక్కువ అవుతున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ లోనే..
తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ సినిమా రంగ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గా మూర్తి యాదవ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి బాలినేనికి ఈ సంస్థలో పెట్టుబడులు ఉన్నాయని జనసేన అంటోంది.. లేవు అని బాలినేనిని అంటున్నారు. అసలు ఇందులో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం అన్నది తేలాల్సి ఉంది. విచారణ జరిపితే అసలు నిజాలు బయటపడనున్నాయి. దీనిపై ఇప్పటికే మూర్తి యాదవ్ ఫిర్యాదు చేయగా.. బాలినేని చెబుతున్నట్టు పెట్టుబడులు లేవన్నది నిజమైతే విచారణకు ఆదేశించేలా చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని పలువురు పేర్కొంటున్నారు.