Narendra Modi’s cabinet : మోదీ 3.0.. అందరూ అనుకున్నట్టు సంకీర్ణ ప్రభుత్వమే.. కానీ అసలు లెక్క వేరే ఉంది

Narendra Modi మొత్తానికి మోడీ 3.0 సంకీర్ణ ప్రభుత్వమే కావచ్చు.. కానీ తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు మరింత బలంగా ఉంటాయని మోదీ చెప్పకనే చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : June 10, 2024 1:01 pm
Follow us on

Narendra Modi’s cabinet : ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. 72 మందితో మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.. ఈసారి మంత్రివర్గంలో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. భాగస్వామ్య పార్టీలకు అవకాశం దక్కేలా చేశారు. పైకి చూస్తే ఇదంతా సర్వసాధారణ ప్రక్రియ లాగా కనిపిస్తోంది. దీని వెనుక మోదీ దూర దృష్టి ఉంది..”ఈ ప్రభుత్వం 15 రోజుల్లో కూలిపోతుందని” మమతా బెనర్జీ లాంటివాళ్ళు అంటున్నారు గానీ.. అలాంటి అవకాశం ఇచ్చే పరిస్థితుల్లో మోదీ కనిపించడం లేదు. భాగస్వామి పార్టీల అభ్యర్థులకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ.. కీలకమైన స్థానాలను బిజెపి తన వద్దే అట్టి పెట్టుకుని ఉంది. మెజారిటీ తక్కువ ఉన్నప్పటికీ.. మోదీ కీలకమైన మంత్రిత్వ శాఖలను తన పార్టీ వారికే ఇవ్వడం ద్వారా సంస్కరణల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని సంకేతాలు ఇస్తున్నారు.

మిత్రపక్షాలు నిశ్శబ్దంగా ఉండడం వెనక..

వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనువైన మెజారిటీ లేని పక్షంలో.. భాగస్వామ్యం అందించే పార్టీలు రకరకాల కోరికలు కోరతాయి. ఇంకా చాలా విషయాలలో పట్టుపడతాయి. కానీ ఈసారి నరేంద్ర మోదీకి సపోర్ట్ అందించిన టిడిపి, జేడీయూ పెద్దగా డిమాండ్ చేయలేదు. అందుకు కారణం లేకపోలేదు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్, జెడియు పరిపాలిస్తున్న బీహార్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లభించాల్సి ఉంది. ఇది గనుక వస్తే ఆ రాష్ట్రాల ముఖచిత్రం మారిపోతుంది. ఆ రాజకీయ పార్టీల భవిష్యత్తు కు డోకా ఉండదు. అందుకే విశాల ప్రయోజనాల దృష్ట్యా అటు టిడిపి, ఇటు జేడీయూ మోదీ చెప్పినట్టు వింటున్నాయి. అందువల్లే ఈసారి కూడా సంచలన నిర్ణయాలు ఉంటాయని మోదీ చెబుతున్నారు. మరోవైపు తన మంత్రివర్గంలోకి ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను తీసుకున్నారు. పరిపాలనను, మిగతా వ్యవహారాలను మరింత వేగంగా నడిపించేందుకు వీరి అనుభవాన్ని ఉపయోగించుకుంటామని మోదీ స్పష్టం చేశారు. వీరికి మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా ఆయా రాష్ట్రాలలో బిజెపి ముఖ్యమంత్రులకు ఇబ్బంది లేకుండా , దిగువ స్థాయి కేడర్ చెక్కుచెదరకుండా మోదీ ప్లాన్ వేశారు. హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎప్పటిలాగే ఈసారి కూడా తన క్యాబినెట్ ప్రమాణస్వీకారంలో ఒక్క ముస్లిం ప్రతినిధికి కూడా మోదీ అవకాశం ఇవ్వలేదు. మలి విస్తరణలో చోటు ఇస్తారో తెలియదు. ఈ చర్య వల్ల హిందూ ఓటు బ్యాంకును సంఘటితం చేసేందుకు మోదీ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ముస్లిం రిజర్వేషన్లపై మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక మోదీ ప్రమాణ స్వీకారానికి గౌతమ్ ఆదాని, ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఈ ఇద్దరు వ్యాపారుల ప్రయోజనాల కోసం ప్రధాని పని చేస్తున్నారని పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ ఆరోపించారు. క్రోని క్యాపిటలిజాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఆయనప్పటికీ నరేంద్ర మోదీ వెనకడుగు వేయడం లేదు. పైగా ఆహుతుల వరుసలో వారికి ముందు స్థానం కల్పించడం విశేషం. మొత్తానికి మోడీ 3.0 సంకీర్ణ ప్రభుత్వమే కావచ్చు.. కానీ తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు మరింత బలంగా ఉంటాయని మోదీ చెప్పకనే చెబుతున్నారు.